గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్సాహంలో కాంగ్రెస్ నాయకత్వం దేశమంతటా బిజెపిని ఓడించాలని సన్నాహాలు చేస్తున్నది. అందుకోసం తను కూడా మృదు హిందూత్వ వ్యూహాన్ని పెంచుతున్నది. ఇలాటి తరుణంలో అత్యధిక పార్లమెంటు స్థానాలున్న రెండు రాష్ట్రాలలోనూ ఆ పార్టీకి మిత్రులే లేకుండా పోవడం పెద్ద దెబ్బగా మారనుంది. బీహార్ ముఖ్యమంత్రి జెడియు నేత నితిష్ కుమార్ ఇప్పటికే బిజెపిని ప్రభుత్వంలో చేర్చుకుని దూరమైనారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ ఆర్జేడీతో కలవాలనుకుంటే ఆయన పశుగ్రాసం కుంభకోణంలో జైలు పాలైనారు గనక దానివల్ల నష్టమనే భావన కాంగ్రెస్లో నెలకొంది. వంటరిగా అక్కడ చేయగలిగింది వుండదు. ఇక యుపి విషయంలోనూ గత ఎన్నికల నేస్తం సమాజ్వాదిపార్టీ ఇప్పుడు దూరం పెడుతున్నట్టే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వంటరిగానే వెళతామని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనను ఆ పార్టీ వారు హర్షిస్తున్నారు. గతసారి అందరికన్నా ముందే రాహుల్ అఖిలేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఓడిపోయారు.తర్వాత స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఏం ప్రభావం చూపలేకపోయిందని ఎస్పి నాయకులు అంచనా వేశారు. అందువల్ల వంటరిగా వెళితేనే మంచిదని అనుకుంటున్నారట. సిపిఎం ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తి లేదని ప్రకటించింది. బెంగాల్లో మమతా బెనర్జీ కూడా దగ్గర కాలేదు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఆమోదించినా ప్రతిపక్షాలు సోనియా గాంధీలా చూసే అవకాశం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇది వరకే ప్రకటించారు. నిజంగానే కాంగ్రెస్ను వచ్చేసారి నెత్తినపెట్టుకునే పార్టీలు పెద్దగా వుండకపోవచ్చు. మరిఎలా గట్టెక్కుతుందనేది పెద్ద ప్రశ్న. రాహుల్ గాంధీ వంటరి కావచ్చు గాని ఆయన ఆద్వర్యంలో పార్టీయే ఒంటరిది కావడంఇక్కడ విశేషం.