మళ్లీ మళ్లీ ఎదురయ్యేది అనుభూతి
ఒక్కసారి జరిగేది అద్భుతం…
‘అజ్ఞాతవాసి’ కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. త్రివిక్రమ్ నుంచి పవన్ అభిమానులు అలాంటి అద్భుతాన్నే ఆశించారు. కానీ.. త్రివిక్రమ్ కనీసం ‘అనుభూతి’ కూడా అందించలేకపోయాడు. సినిమాల్లో లోటు పాట్లన్నీ ఇప్పటికే రివ్యూల్లో ఏకి పాడేస్తున్నారు సమీక్షకులు. వాటి సంగతి పక్కన పెడితే.. స్ర్కిప్ట్ దశలో, దాని తీతలో… త్రివిక్రమ్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. కథ, కథనాల్లో లోపాలు, లాజిక్కులు ఇవన్నీ క్షమించదగినవే. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ నిర్లక్ష్యం మాత్రం క్షమార్హమైనది కాదు. `నేనేం రాస్తే అదే.. పంచ్.. అదే డైలాగ్` అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి కనిపించదు. త్రివిక్రమ్‌లో అదే లోపం. తనలో రచయిత ప్రతీసారీ దర్శకుడ్ని డామినేట్ చేస్తూనే ఉంటాడు. చాలాసార్లు ఆ రచయితే తనని కాపాడాడు. ఈసారి రచయిత కూడా మరుగున పడిపోయాడు. దానికి కారణం.. త్రివిక్రమ్ రాసిందే ఆయన సినిమాల్లో శిలాశాసనం మైపోతుంటుంది. ‘సార్.. ఇంకోలా ఆలోచిద్దాం’ అంటూ ఆయనకు సలహా ఇచ్చేవాళ్లు తన పక్కన లేరు. ఉన్నా… వాళ్ల ఆలోచనలు త్రివిక్రమ్‌కి అక్కర లేదు. మనం రాసిందే వేదం అనుకుంటే.. చెప్పడానికి ధైర్యం చేసేది ఎవరు??
చాలా లూజ్ లూజ్‌గా నడిపేసిన సన్నివేశాలు అజ్ఞాతవాసిలో చాలా కనిపిస్తాయి. వాటిలో బెల్ట్ పట్టుకొనే కొట్టే సీన్ ఒకటి. దాదాపు 5 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగే సన్నివేశం అది. అక్కడ త్రివిక్రమ్ రచయితగా ఘోరంగా విఫలమయ్యాడు. పవన్ తో అల్లరి చిల్లర వేషాలు వేయించడం, అమ్మాయిలా ఫోన్లో మాట్లాడించడం.. ఇవన్నీ చాలా ఓవర్‌గా టూమచ్‌గా అనిపించాయి. ఆఖరికి పవన్ అభిమానులకు సహా. ఇదంతా పవన్ తాలుకూ పైత్యమే కావొచ్చు. కానీ వాటిని తెరకెక్కించడానికి త్రివిక్రమ్ ఎందుకు ఒప్పుకున్నాడు? త్రివిక్రమ్ ఏం చెబితే పవన్ అది చేశాడా? లేదంటే పవన్ డెరెక్షన్‌లోనే త్రివిక్రమ్ నడిచాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్రివిక్రమ్ ఫ్లాప్ సినిమా ఖలేజాలో సైతం త్రివిక్రమ్ మార్క్, పంచ్ అద్భుతంగా కనిపిస్తుంటుంది. కానీ ఇందులో అది బాగా మిస్సయ్యింది. ఓ దశలో ఈ సినిమాకి మాటలు త్రివిక్రమే రాశాడా అనిపించింది. ఒక్కటంటే ఒక్క సన్నివేశాన్ని కూడా తన మ్యాజిక్‌తో నిలబెట్టలేకపోయాడు త్రివిక్రమ్. కథానాయికలిద్దరూ చెంపదెబ్బలు కొట్టుకునే సన్నివేశాన్ని త్రివిక్రమ్ లాంటి రచయిత, విజ్ఞాన వాసి ఎలా ఊహించాడో అర్థం కాదు. త్రివిక్రమ్ లోని మెరుపు తగ్గిందనడానికి ఆ సీన్ నిదర్శనంగా నిలుస్తుంది. ఏ సీన్ తీసుకున్నా.. అందులో త్రివిక్రమ్ తాలుకూ నిర్లక్ష్యం అణువణువూ కనిపిస్తుంది.
త్రివిక్రమ్ డైలాగ్‌నే ఇక్కడ మళ్లీ. మరోలా వాడాల్సివస్తుంది.
వివేకంతో తీస్తే అత్తారింటికి దారేది
విచక్షణారహితంగా తీస్తే అజ్ఞాతవాసి