తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మళ్లీ వార్తల్లో ఉంటున్నారు! ఆయనపై మరోసారి ఆరోపణలకు దిగారు ఏపీ భాజపా శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గవర్నర్ ను నియమించాల్సిన సమయం వచ్చిందనీ, ఈ డిమాండ్ ను కేంద్రం దృష్టికి తాను తీసుకెళ్లబోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నరసింహన్ పై మరోసారి తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మంచిచెడ్డలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఏపీకి సంబంధించిన బిల్లులను పాస్ చేయడానికి కూడా ఆయన ఆసక్తి కనబరచడం లేదని మండిపడ్డారు. నాలా బిల్లు ఆయన ముందు పెట్టి ఆర్నెల్లు గడుస్తున్నా, దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రాకు ఏదో చుట్టపు చూపు అన్నట్టుగా వచ్చిపోతుంటారనీ, ఏనాడైనా ఓ వారం రోజులపాటు ఇక్కడ ఉన్నారా అంటూ ప్రశ్నించారు. కొత్త గవర్నర్ నియామకం వెంటనే జరిగితే ఆంధ్రాకు కొంత మేలు జరుగుతుందనీ, బడ్జెట్ సమావేశాల్లోగా గవర్నర్ నియామకం కావాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
నిజానికి, గవర్నర్ తీరుపై ఈ మధ్య మరోసారి పెద్ద చర్చే జరుగుతోంది. ఆయన తెలంగాణకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా..? తమ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని పరిగణిస్తారా..? అంటే, కాస్త అనుమానంగానే ఉంది! ఎందుకంటే, కేంద్రం దగ్గర తనకంటూ ఓ ‘విశ్వసనీయ’ ముద్రను నరసింహన్ సంపాదించుకున్నారు. నిజానికి, ఆయన కాంగ్రెస్ హయాంలో నియమితులయ్యారు. నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి రాగానే మార్పు తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన భాజపాకి కూడా అదే స్థాయి విధేయతను ప్రదర్శించడం మొదలుపెట్టేశారు! పైగా, కేంద్రంలో కూడా అజిత్ ధోవల్ వంటి మిత్రులు నరసింహన్ కు ఉండటం, దీంతోపాటు గతంలో మోడీకి కూడా కొన్ని కేసుల విషయంలో సాయపడ్డారనే గుసగుసలు కూడా ఉన్నాయి!
దాదాపు దశాబ్దకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేసరికి… ఇక్కడి రాజకీయాలపై ఆయన బాగానే పట్టు వచ్చేసింది. కేంద్రానికి కావాల్సిన నివేదికలేంటో ఆయనకు తెలుసు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ‘తనను కొనసాగించాల్సిన’ అవసరాన్ని కేంద్రం దగ్గర ఎలా ప్రదర్శించుకోవాలో బాగా తెలుసు! మోడీకి ఆయన కావాలీ, మోడీ ఆయన్ని కొనసాగించాలి… ఈ రెండు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి, తమ పార్టీ నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన కేంద్రం దగ్గర్నుంచి తక్షణ స్పందన ఉండే అవకాశాలైతే కనిపించడం లేదు. పైగా, ఆంధ్రాలో అధికార పార్టీ టీడీపీ నుంచి ఇంతవరకూ గవర్నర్ తీరుపై పెద్దగా విమర్శలేవీ లేవు. నాలా బిల్లు తాత్సారం చేస్తున్నా కూడా చంద్రబాబు స్పందించలేదు! పరిస్థితులు నర్సింహన్ ను ఉన్నపళంగా మార్చే విధంగా లేవు. కానీ, ఆంధ్రాకు ప్రత్యేక గవర్నర్ అవసరమనే డిమాండ్ కు తగ్గట్టుగానే నరసింహన్ తీరు ఉంటోందని చెప్పుకోవచ్చు.