సంక్రాంతి దగ్గరకు వస్తున్న కొద్దీ కోడి పందాల టెన్షన్ ఎక్కువైపోతోంది! ఇంతకీ ఈ ఏడాది పందాలు ఉంటాయా ఉండవా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, హైకోర్టు నో అనడం.. గతం కంటే కాస్త కట్టుదిట్టంగా పోలీసుల బందోబస్తు పెంచడం, కొంతమంది పందెం రాయళ్లను అదుపులోకి తీసుకోవడం, కత్తులు కట్టేవారిని కూడా ముందస్తుగా నిర్బంధించడం జరుగుతోంది. అయితే, పందాల మీద చాలా ఆశలు పెట్టుకుని ఏర్పాట్లు చేసుకున్నవారికి కొంత టెన్షన్ అయితే ఉంది! ఈ నేపథ్యంలో నాయకులు చేస్తున్న ప్రకటనలు కూడా కొంత చిత్రంగానే ఉంటున్నాయి! ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిత్రమైన లాజిక్ ను తెరమీదికి తీసుకొచ్చారు. రెండు కోళ్లు ఒకదానికొకటి ఎదురుపడితే సహజంగానే కొట్టుకుంటాయట, ఆ సమయంలో వాటి చుట్టూ నలుగురు గుమ్మిగూడతారట! ఈ గొడవల్ని కోర్టులు ఆపలేవనీ, మనుషులు మాత్రమే ఆపగలరని సెలవిచ్చారు. ఇదేం లాజిక్కో మరి..!
పందాలకు హైకోర్టు నో అని చెప్పినా.. ఇదో సంప్రదాయమూ దీనిపై స్టే తెస్తానంటూ ప్రతీయేటా మాదిరిగానే సుప్రీం కోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణరాజు. గత ఏడాది కూడా కోడి పందాలపై హైకోర్టు సీరియస్ అయితే.. ఆయనే ఢిల్లీకి వెళ్లి స్టే తెచ్చారు. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు. నిర్వాహకులు, ఔత్సాహికులు, కోళ్లు కొట్టుకుంటే ఆపాలని చూసేందుకు సిద్ధంగా ఉన్న ప్రేక్షకులు.. ఇలాంటివారంతా స్టే కోసం చూస్తున్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల అమలు పరిస్థితి ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. చింతమనేని వంటి నాయకులు కూడా కోర్టు ఆదేశాలకు విరుద్ధంగానే స్పందిస్తున్నట్టు చెప్పుకోవాలి..! కోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిసినా… కోడి పందాలు చూడ్డానికి వెళ్తున్నా అంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజుల కిందటే మీడియాతో చెప్పారు. అంతకుముందు, ఉండి ఎమ్మెల్యే కూడా ‘ఈ ఏడాది పందాలు ఉంటాయి’ భరోసా కల్పించే ప్రకటన చేశారు. కొన్ని రోజుల కిందట హోం మంత్రి రాజప్ప కూడా సంప్రదాయ బద్ధంగా కోడి పందాలు ఉంటాయన్నారు.
అసలు సమస్య నాయకుల దగ్గరే ఉంది! వీళ్లేమో సంప్రదాయం అంటారు, కోళ్లు కొట్టుకోవడం సహజం అంటారు. కోర్టు వద్దంటే స్టే తెస్తామంటూ బయలుదేరతారు. అసలు సమస్య పందాలు పేరుతో సాగే జూదం మీద కదా! దానికి అనుబంధంగా మితిమీరే మద్యపానం, గానాబజానాలు. సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ తతంగానికి కూడా నాయకుల అండదండలు ఉండటమేంటనేదే ప్రశ్న..? తమిళనాడులో జల్లికట్టు జరగడం లేదా, దేవరకద్రలో కర్రలతో కొట్టుకోవడం లేదా.. అనే లాజిక్కులు మాట్లాడుతున్నారే తప్ప. ఈ ముసుగులో సాగుతున్న వికృత చేష్టల గురించి నాయకులు పట్టించుకోకపోగా, మద్దతుగా నిలుస్తుండటం విచారకరం..!