ఎన్టీఆర్ బయోపిక్ హడావుడిలో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. జై సింహా విడుదల అయ్యాక… పూర్తి స్థాయిలో ఆ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు. మార్చి నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది. ఈలోగా టీజర్ కోసం కొన్ని షాట్స్ తెరకెక్కించారు. ఈనెల 18న హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేస్తారు. అందుకు తగిన వేదిక కోసం అన్వేషణ జరుగుతోంది. టీజర్ షూటింగ్‌ని రామకృష్ణ స్డూడియోస్‌లో జరిపిన సంగతి తెలిసిందే. సెట్లో… దర్శకుడు, కెమెరామెన్, బాలయ్య తప్ప ఎవరూ లేరట. నాలుగో వ్యక్తి ఉండకూడదు అని స్ట్రిక్ రూల్స్ పెట్టాడట బాలయ్య. ఆఖరికి సెల్‌ఫోన్లనీ తీసుకురానివ్వలేదని.. అంత పకడ్బందీగా షూటింగ్ సాగిందని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ సమయంలోనూ ఇంతే ప్రణాళికా బద్దంగా వ్యవహిరించాలని భావిస్తున్నాడు బాలయ్య. సెట్లో ఏం జరుగుతుంది? ఎలాంటి సన్నివేశాలు తీస్తున్నారన్న విషయం బయటకు పొక్కకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట. ఈ విషయమై తన టీమ్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్ కట్ చేసే పనిలో ఉన్నాడు తేజ. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ గెటప్పులో ఉన్న బాలయ్యని చూపించరట. అన్నీ బ్యాక్ షాట్సే ఉంటాయని, కాకపోతే… ఓ మూడ్ క్రియేట్ చేయడానికి ఈ టీజర్ దోహదపడబోతోందని తెలుస్తోంది.