తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఎట్టకేలకు స్పందించారు! అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఆయన స్పందించారని అనుకోవచ్చు. ఈ మధ్య ఆయన తీరుపై చాలా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీ భాజపా నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాలా బిల్లును ఆయన ఎందుకు ఆమోదించడం లేదనీ, ఇదే తరహాలో తెలంగాణ సర్కారు బిల్లు తయారు చేసి పంపితే మూడు రోజుల్లోనే ఎలా అనుమతించారంటూ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా గవర్నర్ అవసరం అనే డిమాండ్ ను కూడా భాజపా నేత తెరమీదికి తెచ్చారు. బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్ ఏపీకి నియమించాలనే డిమాండ్ చేశారు. అయితే, ఈ అంశం ఇంకా ముదిరి పాకాన పడబోతోందన్న తరుణంలో గవర్నర్ నరసింహన్ స్పందించారు.
వ్యవసాయ భూమిని వ్యవసేయతర భూమిగా మార్చుకునేందుకు వీలు కల్పించే ఈ నాలా బిల్లు ఇప్పటికే గవర్నర్ దగ్గరకు రెండు పర్యాయాలు వచ్చింది. ఏపీ అసెంబ్లీ ఆమోదించి పంపినా, ఆయన కొన్ని కొర్రీలు వేస్తూ మళ్లీ వెనక్కి పంపడం వివాదానికి కారణమైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తాజా వివరణతో గవర్నర్ సంతృప్తి చెందినట్టు సమాచారం. నరసింహన్ లేవనెత్తిన అభ్యంతరాలపై రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో నాలా బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర పడింది. దాదాపు నెల్రోజులకు పైగానే ఈ బిల్లుపై చాలా చర్చ జరిగింది. ఈ బిల్లు ఆమోదంతో నాలా పన్ను కొంత శాతం తగ్గుతుంది.
మొత్తానికి, గవర్నర్ తన పట్టు వీడారనే అనుకోవచ్చు. ఏపీ ప్రభుత్వంతోపాటు అక్కడి భాజపా నేతలు కూడా ఆయన తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చర్చను మరింత పెంచుకుంటూ పోతే వేరే రకమైన ఇబ్బందులు తలెత్తే ఉద్దేశం ఉండటంతో… దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే నాలా బిల్లు విషయంలో సానుకూలంగా స్పందించినట్టు చూడొచ్చు. నిజానికి, కేంద్రం దగ్గర నరసింహన్ కు మంచి గుర్తింపు ఉంది. అందుకే కదా… పదవీ కాలం ముగిసిపోయినా ఆయన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లే ఆస్కారం ఉన్నట్టుగా గడచిన నాలుగైదు రోజులుగా నాయకుల ప్రకటనలు ఉంటున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో గవర్నర్ సానుకూల స్పందన విశేషం. తెలంగాణ పక్షపాతి అనే ముద్ర నుంచి బయటపడే దిశగా ఆయన స్పందన మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.