యువ కథానాయకుల్లో శ్రీవిష్ణుది ఓ ప్రత్యేకమైన దారి. తనకు నచ్చిన, నప్పిన కథల్ని ఎంచుకుంటాడు. మాస్, మసాలా జోలికి వెళ్లడు. వైవిధ్యభరితమైన కథలకు ఓకే చెబుతాడు. మెంటల్ మదిలోతో ఓ కమర్షియల్ హిట్ కూడా అందుకున్న విష్ణు.. ఇప్పుడు తన జోరు మరింత పెంచాడు. ప్రస్తుతం `వీరభోగ వసంత రాయులు`లో నటిస్తున్నాడు విష్ణు. నారా రోహిత్, సుధీర్ బాబు కథానాయకులుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు పాత్ర, గెటప్ సరికొత్తగా ఉండబోతున్నాయి. ఆయన హెయిర్ స్టైల్ చూస్తే.. షాక్ తినడం ఖాయం. ఈ సినిమా కోసం ఆయన కూడా తెగ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. గత మూడు రోజుల నుంచీ విష్ణు సెట్లోనే ఉన్నాడు. 72 గంటల్లో నాలుగైదు గంటలు మినహా.. మిగిలిన సమయమంతా సెట్లోనే గడిపాడు. అక్కడే తిండి, అక్కడే నిద్ర. విష్ణు నిద్రపోయింది కూడా మహా అయితే రెండు మూడు గంటలలేనట. ఇదంతా విష్ణు అంకితభావానికి నిదర్శనం. శ్రీవిష్ణు నటించిన `నీదీ నాదీ ఒకే కథ` సినిమా పూర్తయింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.