జనవరి 25న తెలంగాణ బహుజన లెఫ్ట్‌ఫ్రంట్(బిఎల్ఎప్) ఏర్పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ కూటమిలో 28 పార్టీలు వుంటాయన్నారు. ప్రధానంగా దళిత బహుజన వర్గాలకు చెందిన నేతలు ఏర్పాటు చేసిన సంస్థలు రాజకీయ పక్షాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ ఫ్రంట్‌కు గతంలో వైసీపీ నేతగా వుండిన నల్లా సూర్యప్రకాశరావు అద్యక్షుడుగానూ వీరభద్రం కన్వీనర్‌గానూ వుంటారట. సామాజిక న్యాయం ఎజెండాగానే ఈ సంఘటన పనిచేస్తుందని వీరభద్రం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమన్నారు. సిపిఎం ఈ తరహా ఫ్రంట్ కోసం చొరవ తీసుకోవడం ఈ పేరుతో ఏర్పడ్డం దేశంలో ఇదే ప్రథమం. ఇన్ని సంఘాలు వ్యక్తులు వున్నందువల్ల ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ నాయకులలో ఆందోళన వుంది.అయితే ఆ పార్టీతో పొత్తుకు బిఎస్ఎప్ సిద్ధంగా లేదు. సిపిఐ, సిపిఐ ఎంఎల్‌లను కూడా ఈ సంఘటనలోకి. ఆహ్వానిస్తున్నామని నాయకులు చెబుతున్నారు గాని ఇప్పటికి లేవు. తెలంగాణలో కులపరమైన దౌర్జన్యాలను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ గాని ఇతర ప్రధాన పార్టీలు గాని ముందుకు రావడం లేదని చాలాసార్లు వెల్లడైంది. ఇది ఎస్సి బిసి నాయకులకు ఆగ్రహంగా వుంది.దానికి తోడు ఈ ఎన్నికలు రెండు కులాల మధ్యనే జరుగుతున్నట్టు సాగే ప్రచారం కూడా వారికి మింగుడు పడటం లేదు. జెఎసి చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేసే పార్టీ కూడా జనవరి ముగింపులోగా అవతరిస్తుందని అనుకుంటున్నారు. ఆయన కూడా ఈ కూటమితో వుండకపోవచ్చు కాంగ్రెస్ కేంద్రంగా మరో కూటమని లేదా సర్దుబాట్టను తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది. బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి తమ పార్టీ పరిస్తితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏ పార్టీలోనైనా చేరే విషయం సంక్రాంతి తర్వాత నిర్ణయిస్తామని అంటున్నారు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో పునస్సమీకరణలకు చాలా అవకాశం కనిపిస్తుంది.