ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది..? ఇంకెవరు.. జగన్మోహన్ రెడ్డి చుట్టూ మాత్రమే! అసెంబ్లీ అంటే ఆయనే మాట్లాడాలి. ఆయన రాకపోతే అసెంబ్లీకి వైకాపా నేతలు కూడా రారు! పాదయాత్ర అంటే ఆయనే చేయాలి. ఇతర నేతలు జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలి. ఇంతకీ, వైకాపాలో జగన్ తరువాతి స్థాయి నాయకులు ఎవరు..? ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నం వైకాపా నాయకులు కూడా చేయరు అనే అభిప్రాయమూ ఉంది. అధినేత ఏది చెబితే అదే ఫైనల్.. అంతే! వైకాపాలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని బయట ఎప్పట్నుంచో ప్రచారం ఉంది. అయితే, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, కీలక బాధ్యతల్ని కొంతమందికైనా ఇవ్వాలి కదా! అలాగని, నిర్ణయాత్మక అధికారంలో భాగం ఇస్తారని ఎవ్వరూ అనుకోర్లెండి. మరి, ఈ ‘బాధ్యత పంపిణీ’ అనే టాపిక్ ఇప్పుడెందుకూ అంటే… కొంతమంది నేతలకు ‘మరింత దూకుడుగా మాట్లాడే’ అనుమతి జగన్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైకాపా ప్రచారమన్నా, సభలన్నా జగన్ మాత్రమే మాట్లాడతారు. ఆ తరువాత కొంతంలో కొంత ఎమ్మెల్యే రోజా కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే, కొత్తగా మరో ముగ్గురికి కూడా దూడుకు పెంచమని జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మరో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్… ఇదే జాబితాలో రోజా ఎలాగూ ఉన్నారనుకోండి! వీరంతా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పర్యటించాలని కూడా జగన్ నుంచి సూచనలు అందాయట! చంద్రబాబు సర్కారును మరింత బలంగా ఎదుర్కొనేందుకు కావాల్సిన సమాచారాన్ని తయారు చేసుకోవాలనీ, ఆ తరువాత నియోజక వర్గాలవారీగా పర్యటనలకు వెళ్లే షెడ్యూల్ ఖరారు చేసుకోవాల్సిందిగా వారికి జగన్ ఆదేశించినట్టు చెబుతున్నారు!
అయితే, వీరికి ‘మైకు స్వేచ్ఛ’ ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా..? రాష్ట్రవ్యాప్తంగా వీరు పర్యటనలకు వెళ్లి మాట్లాడితే సరైన స్పందన వస్తుందా..? వైకాపా కార్యకర్తలూ అభిమానుల్ని కాకుండా… సామాన్య ప్రజల్ని వీరు ఎంతమేర ప్రభావవంతంగా ఆకర్షించగలరు అనేదే అసలు ప్రశ్న! రోజా వ్యాఖ్యలూ విమర్శలకు వైకాపా శ్రేణుల్లో ఆదరణ ఉండొచ్చేమోగానీ… సామాన్యుల్లో మాత్రం కొంత ఏవగింపు ఉందన్నది నిజం. రాజకీయంగా తటస్థ భావనతో ఉండేవారికి ఆమె వ్యవహార శైలి పెద్దగా రుచించదు అనే అభిప్రాయం ఉంది. ఇక, కొడాలి నాని దూకుడు కూడా అంతే..! ఆయన అభిమానులు, అనుచరగణమే తప్ప.. సామాన్యులను ఉర్రూతలూగించే ప్రసంగాలేమీ ఆయన ఇచ్చిన దాఖలాలు గతంలో లేవు. ఇక, మిగిలింది ఆళ్ల రామకృష్ణా రెడ్డి… కోర్టుల్లో వివిధ అంశాలపై టీడీపీని నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన చేసిన కృషీ పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా కేడర్ కు కూడా పరిపూర్ణంగా చేరలేదేమో అనే అభిప్రాయమూ ఉంది. యువనేత అనిల్ కుమార్ యాదవ్ ని తీసుకున్నా… ఆయన గొంతు కూడా ఇంకా నెల్లూరు పరిధి వినిపించడం లేదనే చెప్పాలి.
మరి, ఏ లెక్క ప్రకారం వీరిని అన్ని నియోజక వర్గాలకూ ప్రచారం కోసం పంపాలని నిర్ణయించారనేది వారికే తెలియాలి. పైగా, ప్రచారంలో వీరికి పెద్ద పీట వేస్తుంటే… సీనియర్ల పరిస్థితి ఏంటి..? జగన్ నిర్ణయం శాసనమే అయినా… ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లకు ఎంతవరకూ ఆమోదయోగ్యం అనే చర్చ కూడా మిగిలే ఉంటుంది కదా! కనీసం వారితో చర్చించైనా జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకోవచ్చా..?