ఒక్కరోజుతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకుంటే… ఆ గొంతుకు మరో గొంతు తోడు కావడం విశేషం! అదేనండీ… తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. ఒకప్పుడు కేసీఆర్ ను బండబూతులు తిట్టినవారే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాజ్యమేలుతున్నారన్నారు. కేసీఆర్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారంటూ నాయని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే, రాయడానికి వీల్లేని పదజాలం ఉపయోగించి మరీ నాయని కాస్త ఆవేశంగా మాట్లాడారు. అయితే, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తాను విమర్శిస్తున్నట్టు అర్థం రాకుండా జాగ్రత్తపడ్డారు. రైతులకు 24 గంటలు విద్యుత్ అందిస్తూ కొత్త చరిత్రను సృష్టించారు అన్నారు!
సరే, ఆయన వ్యాఖ్యలపై ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. దీంతో ఇది అక్కడితో ఆగిపోతుందని అనుకుంటే… ఇవాళ్ల నాయనికి మద్దతుగా తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించడం విశేషం. నాయని చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు వాస్తవం అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు ఇప్పుడు మంత్రివర్గంలో కొనసాగుతున్నారంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి గుర్తుచేసుకున్నప్పుడల్లా తనకు కళ్ల వెంట నీళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుబట్టే విధంగా తన వ్యాఖ్యలు ఉండకూడదని బాగా జాగ్రత్తపడ్డారు! ఆ సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల నేపథ్యం వేరుగా ఉందంటూ వెనకేసుకొచ్చారు. అంతిమంగా ఏ ఒక్క ఉద్యమకారుడినీ కేసీఆర్ మరచిపోరు అన్నారు. తెలంగాణకు సహకరించినవారినీ, కారకుల్ని ఆయన వదిలేయరు అని చెప్పారు. సరైన సమయంలో ఎవరికి ఎలాంటి మేలు చేయాలో అది చేస్తారన్నారు. నిజమైన ఉద్యమకారులకు మంచిరోజులు ఉన్నాయని అన్నారు. ఆరోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలూ కుతంత్రాలు జరుగుతున్నప్పుడు, ఆ సందర్భానికి అనుగుణంగా తనకు ఇష్టం లేకపోయినా ఆ నిర్ణయం కేసీఆర్ తీసుకొని ఉండొచ్చని విశ్లేషించారు.
నిజమైన తెలంగాణ పోరాట యోధులకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి కొన్నాళ్లుగా ఉంది. ఇదే సమయంలో ఉద్యమంతో సంబంధం లేనివారిని అందలం ఎక్కించారనే అభిప్రాయమూ ఉంది. అయితే, మంత్రి నాయని ఈ చర్చ లేవనెత్తారు కాబట్టి… దీన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వకుండా… కొంత లాజికల్ గా సర్దిచెప్పే ప్రయత్నం శ్రీనివాస గౌడ్ చేసినట్టు అనిపిస్తోంది. ఉద్యమకారులకు మంచి రోజులు ఉన్నాయని కూడా చెప్పడం కొంత ముందుజాగ్రత్త చర్యగా కనిపిస్తోంది. ఒకవేళ రేప్పొద్దున్న కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇదే అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లినా… ఉద్యమకారులకు కేసీఆర్ ఇంకేదో చేస్తారన్న ఆశను కొంత సజీవంగా ఉంచడం అనేది ముందస్తు నష్ట నివారణ చర్యగానే చూడొచ్చు. ఇంతకీ, అదే వ్యూహంలో శ్రీనివాస్ గౌడ్ స్పందించారా…? లేదంటే, ఈ సందర్భంలో తనలోని ఉన్న అసంతృప్తిని కూడా బయటపెట్టారా అనేది కూడా చర్చనీయాంశమే.