శుక్రవారం నాడు కనీవినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు నలుగురు చేసిన తిరుగుబాటు సర్దుబాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.వాస్తవానికి దేశంలో అన్ని పార్టీలూ ప్రభుత్వమూ కూడా న్యాయమూర్తులు తమలో తాము సర్దుబాటు చేసుకోగలరనే ఆశాభావం వెలిబుచ్చాయి. సంక్షోభం తీవ్రమైందే గాని న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడ్డం కూడా కీలకమనే దృష్టి అందరిలో వుంది. ఆదివారం నాడు ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆ నలుగురితో సమావేశమవుతారని భావిస్తున్నారు. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, తర్వాతి ప్రధానన్యాయమూర్తిగా భావిస్తున్న రంజన్ గోగోరులు ఈ సంగతి సూచనగా చెప్పారు. తమమధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఇరు పక్షాలూ చెప్పడం ఇందుకు ఒక సంకేతం. మరో న్యాయమూర్తి కురియన్ జోసప్ కూడా ఇలాగే స్పందించారు. ప్రస్తుతం పర్యటనలో వున్న తక్కిన ఇద్దరు అంటే చలమేశ్వర్, మదన్ బి లోకూర్లు తిరిగివచ్చాక ఆదివారం మద్యాహ్నం మిశ్రా వారితో చర్చలు జరుపుతారు. అయితే ఆయన తన నిర్ణయాలు మార్చుకునే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే సుప్రీం కోర్టు బార్కౌన్సిల్ ప్రతినిధులు ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. మరో వైపున ప్రధాని మోడీ కార్యదర్శి నృపేన్ మిశ్రా దీపక్ మిశ్రా నివాసానికి కారులో వెళ్లడం వివాదంగా మారుతున్నది. ప్రధాన న్యాయమూర్తి నివాసం నుంచి ఆయన కారులో తిరిగి వస్తున్న దృశ్యం సిసిటీవీలలోనమోదైంది. ఆయన లోపలకి వెళ్లలేకపోయారని అంటున్నా అసలు ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ కోరింది. ఏది ఏమైనా జడ్జిలు మీడియా ముందుకు వెళ్లి వుండకూడదనే భావం కూడా బలంగా వినిపించింది. మరో వైపున మాజీ ఆర్థిక మంత్రి, ఐఎఎస్ అధికారి యశ్వంత్ సిన్హా మాత్రం ఈ జడ్జిల లాగానే మోడీ మంత్రివర్గ సభ్యులు కూడా బయిటపడి తమ గొంతు విప్పాలని తప్పులు సవరించాలని కోరారు.