ఏది ఏమైనా ఎవరు ఏమన్నా రేవంత్ రెడ్డి హుషారే వేరు. ఎప్పుడూ ఏ పాయింటు జనానికి ఎక్కుతుందా అని ఆలోచిస్తుంటారు. నోటి దురుసు వున్నా సమస్యలు కూడా లేవనెత్తుతుంటారు. కాంగ్రెస్లో ప్రవేశించాక ఈ యువ నాయకుడికి పరిమితులు ఏర్పడతాయనుకున్నారు గాని తన చురుకుదనంతో అక్కడా వేడి పుట్టించారు. 24 గంటల విద్యుత్ అపూర్వ విజయమని ప్రచారం చేసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలోనే వివరణలు సంజాయిషీలు ఇచ్చే పరిస్తితికి తీసుకొచ్చారు. వరుసగా ఆరోపణలు చేసి సవాళ్లు విసిరి బాల్క సుమన్ నుంచి కెటిఆర్ వరకూ అందరిని రంగంలోకి తెచ్చారు. తమాషాఏమంటే టిఆర్ఎస్ను మించి కాంగ్రెస్ నాయకులే దీనివల్ల బేజారై పోతున్నారు. ఆయన అదేపనిగా ప్రస్తావించడంతో కరెంటు గురించి మాట్లాడాల్సిన పరిస్తితి కాంగ్రెస్ నేతలకు అనివార్యమైంది. ఆ విధంగా రేవంత్ కాంగ్రెస్ నేతల ఎజెండాను నిర్ణయించినట్టయింది. మొదట కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ఇచ్చిన మాట నిజమే గాని దాని దారి వేరు. తమ హయాంలోనే అధిక వుత్పత్తికి బాటలు పడ్డాయన్నది వారి థీమ్. రేవంత్ విషయానికి వస్తే ఎక్కువ రేటుకుకొంటున్నారనీ, ముడుపులు చేతులు మారాయనీ ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు. అదే తరహాలో మొత్తం కాంగ్రెస్ గొంతు వినిపిస్తున్నది. ఇప్పుడైతే కరెంటు కొనుగోళ్లపైన సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నది. ఈ విధంగా రేవంత్ తెలంగాణ రాజకీయ వివాదాలకు కరెంటు ఎక్కించేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరన్నారు.ఇక మేము కూడా మాట్లాడక చస్తామా అని ఆయన తలపట్టుకున్నారు.