చాలా కాలంగా అనుకుంటున్న పార్టీ స్థాపన ప్రక్రియను ప్రొఫెసర్ కోదండరాం ఫిబ్రవరి 3 లేదా 4 తేదీలలో ప్రారంభించబోతున్నారు. రాజకీయ జెఎసిని నామకార్థంగా కాపాడుతూనే తామంతా పార్టీగా ఏర్పడాలన్నది ఆయన ఆలోచనగా అగుపిస్తుంది. ఆరు మాసాల కిందటే నాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో పార్టీ స్థాపన అవసరమని అభిప్రాయం వెలిబుచ్చిన కోదండ ఇంత కాలం రకరకాల సంప్రదింపులలో చర్చలలో గడిపారు. బయిట కాంగ్రెస్‌తోనూ లోపల తన జెఎసి సహచరులతోనూ ప్రధానంగా ఈ చర్చలు నడిచాయి. ఆప్ నమూనాను పరిశీలించినప్పటికీ ఈ పార్టీ తనదైన ప్రత్యేక రూపంలోనే వుండేట్టు తెలుస్తుంది. స్వంత పార్టీ లేకుండా పరిపాలనను ప్రభావితం చేయడం సాధ్యం కాదు. తెలంగాణ సాధించేందుకు జెఎసి గొప్ప పునాది వేసింది గాని తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఏ మాత్రం మార్చలేకపోయింది. పైగా చాలా మంది ఉద్యమ కారులను ఆయనవిధేయులుగా చేసుకుని పదవీ పంపకాలు చేశారు.ఈ పరిస్థితులలో మాకంటూ ఒక పార్టీ వుంటే ముందస్తు షరతులతో అవగాహనకు వచ్చి పోటీ చేయొచ్చు. మా సహాయంతో గెలిచినవారిపై ఒత్తిడితేవచ్చు అని జెఎసి నేతలు చెబుతున్నారు. తెలంగాణ జనసమితి లేదా సకల జనుల పార్టీ వంటి పేర్లు పరిశీలనలో వున్నాయట. రిజిస్ట్రేషన్ చేయించడమే గాక జాతీయ నాయకులతో చర్చలు జరిపేందుకోసం ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు. కోదండరాంతో పాటు విద్యుత్ జెఎసి నాయకుడు రఘు,ఇటిక్యాల పురుషోత్తం, బిఎన్‌రెడ్డి, గురిజాల రవీందర్ వంటివారు ఈ చర్చలలో ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్‌తోనే గాక బిజెపితో కూడా సీట్ల సర్దుబాట్లకు సిద్ధమవచ్చని అంటున్నారు. అయితే ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమనేది టిఆర్ఎస్ విమర్శగా వుంది. కోదండరాం ద్వారా సిపిఐ కూడా ఈ కూటమికి సహకరించవచ్చునని చెబుతున్నారు. సిపిఎం వరకూ బిఎల్ఎప్ పేరిట వేరే కూటమిని మరో పదిరోజులలో ప్రారంభించనున్నది. తెలంగాణ రాజకీయ పునస్సమీకరణలో ఇదే మొదటి నిర్ణయాత్మక మలుపు కావచ్చు.