గ్రేటర్ హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీలు మల్లగుల్లాలు పడుతుండగా టిఆర్ఎస్ ఎలా కేంద్రీకరించి పావులు కదుపుతూ వచ్చిందో గతంలో చెప్పుకున్నాం. ఇందులో భాగంగానే కెసిఆర్ ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా నగరానికి కెటిఆర్‌ను దళపతిగా పంపించి వారసత్వానికీ ఆమోద ముద్ర వేయించుకున్నారు. అధికార పూర్వక హౌదాలో కెటిఆర్ రంగంలోకి దిగినప్పటి నుంచి శంకుస్థాపనల పర్వంతో పాటు సీమాంధ్ర ఓటర్లను మెప్పించడం ప్రధాన వ్యూహంగా చేసుకున్నారు. స్నేహగీతాలాపన సాగిస్తున్నారు. ఆఖరుకు పార్టీ పేరును తెలుగురాష్ట్రసమితిగా మారుస్తామనీ భీమవరంనుంచి పోటీ చేయొచ్చనీ చెప్పి తర్వాత ఇదంతా జోక్ అని సర్దుకున్నారు. ( మళ్లీ ఆయనే మాటల జోరులో బిజెపిని భారతీయ జోక్పార్టీ అని చమత్కరించి విమర్శలు తెచ్చుకున్నారు.) వందస్థానాలు గెలుస్తామని పదేపద్లే ప్రకటించడమే గాక మేయర్ తమవారు కాకపోతే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఆయన సవాలు వంద స్థానాలు తెచ్చుకోవడంపైనే అన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే టిఆర్ఎస్ వారు మేయర్ పీఠం గురించేనని వివరణ ఇచ్చారు. ఆ రోజున నమస్తే తెలంగాణలో ఆ సవాలును ఏమాత్రం ప్రముఖంగా ఇవ్వలేదు. ఎందుకంటే కెటిఆర్ మితిమించిన అత్యుత్సాహంతోనే ఇవన్నీ మాట్లాడారని భావించే వారు పాలకపక్షంలో వున్నారు. తమ నేతను దూరం పెట్టారని హరీష్ అనుయాయులూ ఆవేదన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక విధమైన అభద్రతకు కూడా గురవుతున్నారు. వీటి ప్రభావం భవిష్యత్తులో తప్ప ఇప్పటికేమీ వుండదు.
పాలకఫక్షం ఇలా మాట్లాడుతుంటే మరో వైపున కాంగ్రెస్ టిడిపి బిజిపి నేతలు ఉద్యమ కాలంలో ఉద్రేకాలు రెచ్చగొట్టడం,విగ్రహాలపై దాడి వంటి మాటలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేవి ఎన్నికల మాటలేనని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా కలసి వుండాల్సిన ప్రజలకు పాత ఉద్రేకాలు గుర్తు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. పైగా ఆ కాలంలో సిపిఎం మినహా తక్కిన పార్టీలన్నీ రెండు వైపులా రెండు విధాల మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. కమ్యూనిస్టేతర పార్టీల నేతలు చాలామంది తెలంగాణలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, లగడపాటి వంటి చాలా మంది ఈ కోవలోకి వస్తారు. అయినా ప్రజలు విజ్ఞత గలవారుే గనక విభజన కోరినా కోరకపోయినా నాయకుల కవ్వింపులకు లోనవకుండా ప్రశాంతత కాపాడుకున్నారు. ఇప్పుడు విభజన తర్వాత సహజంగానే టిఆర్ఎస్ ప్రభుత్వం తన పట్టుపెంచుకోవాలని చూస్తున్నది తప్ప ఉద్రిక్తతలు కోరుకోదు.పైగా హైదరాబాదులో పెట్టుబడులు వ్యాపారాలు సినిమా మీడియా తదితర రంగాల్లో అందరి వాటా వుందని దానికి బాగా తెలుసు. తెలుగుదేశం ఎంఎల్‌ఎలే పార్టీలు మార్చేసినపుడు గతంలో దానికి ఓటు వేసిన వారిలోనూ కొంత మార్పు కనిపిస్తుంది. నగరంలోని వ్యాపార వర్గాలు సంపన్న తరగతులు పాలించేపార్టీతో మంచిగా వుండటం అనివార్యమనే భావనకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఉభయ చంద్రుల ఆలింగనాల తర్వాత మరో ప్రత్యర్థి శక్తి వారికి కనిపించకపోవడం ఇందుకు కారణమవుతున్నది. అందుకే ప్రాంతీయ సామాజిక కారణాల రీత్యా తెలుగుదేశం వెనక వున్న చోట్ల కూడా కవితనో కెటిఆర్నో ఆహ్వానించి మంచి చేసుకుందామన్నట్టు కొందరు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ నిజమే అయినా స్థానిక అంశాలు వ్యక్తిగత సంబంధాలు ఓట్ల విభజన వంటి చాలా ప్రభావాలు జయాపజయాలను నిర్ణయిస్తాయి.
నిజాం కాలేజీలో జరిగిన ప్రారంభ సభలో చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్ను రాజకీయంగా ఒక్క విమర్శకూడా చేయలేదు. తమకాలంలో అభివృద్ధి జరిగిందనీ, 2019లో అధికారానికి తీసుకురావాలనీ ఆయన చెప్పినా నామకార్థంగా చెప్పినట్టేవుంది. లోకేష్మాటల్లోనూ అభివృద్ధికి సంబంధించిన పోలికలతో పోటీ తప్ప రాజకీయ పదునులేదు. ఇంకోవైపున బిజెపి అచ్చంగా మజ్లిస్ సీట్ల గురించే మాట్లాడుతూ మతపరమైన ఎత్తుగడలు కొనసాగిస్తున్నది.చండీయాగకర్తగా వాళ్లను మించిపోయిన కెసిఆర్ మజ్లిస్‌తోనూ లోపాయికారి అవగాహన చేసుకున్నారు. కనుక ఆయన పరిస్థితి ఉభయతారకంగా వుంటుంది. అసలు టిఆర్ఎస్ అధికారం చేపట్టగానే కెటిఆర్ చేసిన మొదటి పని మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీని కలిసి మంతనాలు జరిపి మద్దతు కూడగట్టడమే.ఇప్పుడు కూడా స్వంతంగా మెజార్టి రాకుంటే వారి మద్దతు గురించి ఆలోచిస్తామని ఆయన మాతో ఒక చర్చలో సూటిగానే చెప్పేశారు. టిఆర్ఎస్ జాబితా ప్రకటించి రంగంలోకి దిగిపోయింది గాని కాంగ్రెస్‌లో చాలా సమస్యలున్నాయి. ఎన్‌డిఎ సీట్ల పంపకం చర్చలు ముగించినా వివాదాలు మిగిలే వున్నాయి. కేంద్ర మంత్రులూ పవర్స్టార్లు అగ్రనేతల జోక్యాల వరకూ వున్నా సఖ్యత సమస్యగానే వుంది. ఇవి కూడా టిఆర్ఎస్కు ఉపయోగపడే అంశాలు.
ఎన్నిచెప్పినా ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. కనుక రేపు ఒకవేళ అనుకున్నట్టు విజయం పొందలేకపొయినా టిఆర్ఎస్ అందరి పట్ల ఇదే సుహృద్భావాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మాతో ఒక టీవీ చర్చలో ఫోన్ఇన్లో వచ్చిన వీక్షకుడు చేసిన ఈ సూచనను కెటిఆర్ వంటి వారువెంటనే ఆమోదిస్తే బావుంటుంది. అలా అన్నంత మాత్రాన అపశకునం అనో ఓటమికి సిద్ధమైనట్టుగానో భావించనవసరం లేదు.
ఏదో విధంగా హైదరాబాదు కార్పొరేషన్‌పై టిఆర్ఎస్ జెండా ఎగరినా సీట్లన్నీ వచ్చిపడిపోతాయనుకోవడం అతిశయోక్తి. అది తన సుహృద్భావ సందేశాన్ని త్రికరణశుద్ధిగా వారు నిరూపించుకోవలసి వు ంటుంది. కొన్ని స్థానాల్లో ఇప్పటికీ వారికి ఆదరణవుండకపోవచ్చు. తెలంగాణ ఇచ్చినందుకు ఫలితం పొందలేకపోయామని విచారించే కాంగ్రెస్, ప్రత్యేక కూటమిగా ఏర్పడిన వామపక్షాల పోటీని కూడా ప్రస్తావించవలసి వుంది. రాజకీయాలను పక్కనపెట్టి హైదరాబాదు నగర పౌర సమస్యలూ ప్రస్తావించుకోవాలి. ఆవి మరో కథనంలోచూద్దాం.