”నాకు బేసిగ్గా భయం, సిగ్గు. కానీ అలీ పక్కన వుంటే కొంచెం ధైర్యంగా ఉటుంది. అలీ లేకుండా నా సినిమా వుండదు. అలీ నా గుండె” పవన్ కళ్యాణ్ అలీ ని ఉద్దేశించి చెప్పిన మాటలివి. నిజమే ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అలీ కనిపించని సినిమా వుండదు. కానీ అజ్ఞాతవాసిలో అలీని ఎందుకో మిస్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ కు కుడా అలీ అన్నా అతని టైమింగ్ అన్న విపరీతమైన ఇష్టం. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ తో పాటు అలీ పాత్ర కూడా ట్రావెల్ అవుతుంది. వాళ్ళ మధ్య జరిగిన సన్నివేశాలన్నీ తెగ అలరించాయి. అజ్ఞాతవాసి లో కూడా ఆ ఆఫీస్ లో ఒక పాత్రను క్రియేట్ చేయొచ్చు. అలీ- పవన్ ల ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ను వాడుండవచ్చు.
కానీ త్రివిక్రమ్ కు ఈసారి ఏమనిపించిందో.. అలీకి పాత్ర రాయలేదు. బహుశా ఈ కథలో అలీ కి చోటు లేదనుకున్నారేమో. అయితే త్రివిక్రమ్ అనుకుంటే అలీ కి ఒక పాత్ర క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాలేదు.కానీ త్రివిక్రమ్ పెన్ అటుగా వెళ్ళలేదు.అజ్ఞాతవాసిలో కనిపించిన మిస్సింగ్ ఫీలింగ్ లో అలీ కూడా ఒకరని ఇప్పుడు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలే చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు.. అజ్ఞాతవాసి ఫ్లాఫ్ కు అలీ సెంటిమెంట్ కూడా ఒక కారణమని ఇపుడు ఫీలౌతున్నారు ఫ్యాన్స్.