నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ విమర్శలతో భగ్గుమన్న న్యాయవ్యవస్థ ఇంకా పూర్తిగా కుదటపడినట్టు లేదు. బార్ కౌన్సిల్, ప్రధానన్యాయమూర్తి, అటార్నీ జనరల్ ఇలా పలువురు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తున్నా చిక్క ముడి వీడలేదు. ఎందుకంటే ఈ వివాదంలోచాలా కోణాలు వున్నాయి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై వ్యక్తిగత అరోపణలు ఒక కోణం. ఆయన సీనియారిటీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బెంచీలను ఏర్పాటు చేసి కేసులు అప్పగిస్తున్నారనేది మరోకోణం. బహిరంగమైన వివాదాన్ని గౌరవప్రదంగా ముగించాలన్నది ఇంకో కోణం. ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతున్నాయి. ఈ రోజు జస్టిస్ ఎంవిరమణ న్యాయమూర్తులకు విందు ఇచ్చారట. వీటిలో ఏవో మధ్యేమార్గాలు వెతుకుతుండవచ్చు.అయితే సీనియర్టి ఎలా వున్నా అందరం సమానమైనప్పుడు మాకు కేసులు ఇస్తే మీరెలా తప్పు పడతారని జూనియర్ జస్టిస్‌లు ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఈ నలుగురి తర్వాత 21 మంది వున్నారు. వారు కూడా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. పైగా గత 20 ఏళ్లలో రాజీవ్ హత్యకేసు, ఆద్వానీ అయోధ్య కేసు, మాజీ ఫ్రధాని పివి కేసు వంటివి కూడా జూనియర్ జస్టిస్‌లే చూశారట. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని వారి ఆక్షేపణ. ఈ లోగా ఒత్తిడికి గురైన కీశే జస్టిస్ లోయా కుమారుడు తమకు ఇప్పుడు తండ్రి మరణంపై ఎలాటి అనుమానాలు లేవని గతంలో చేసిన విమర్శలను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు.మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం దానిపై కొత్తగానివేదిక పంపింది.ఇవన్నీ మాఫీ దిశలో నడుస్తున్న పరిణామాలు.ఇక ప్రభుత్వం విషయానికి వస్తే కొలీజియం సభ్యులు ఇంతగా కీచులాడుకుంటే నియమాకాలు వారికి ఎలా అప్పగిస్తామనే తర్కం తీసుకొస్తున్నది. నియామకాలపై తమ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తికి చెప్పగలం తప్ప కొలీజియం సభ్యులందరికీ వివరించబోమని ప్రభుత్వం అంటున్నది. ఆయన వారికి దగ్గర అనే ఆరోపణలున్నప్పుడు మళ్లీ ఆయనకే చెబితే ఇతరులు ఒప్పుకోకపోవచ్చు. అది మరో వివాదం కావచ్చు. మొత్తం బెంచి కూచుని ఈ సమస్య చర్చించాలనేది మరో సూచన.ఇవన్నీ అప్పుడే ఒక కొలిక్కి రావు.