ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలుసుకున్నారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించి ఓ వినతి పత్రాన్ని ఇచ్చారు. వచ్చే బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్ద పీట వేయాలంటూ జైట్లీని కోరారు. ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించాలనీ, కొత్త రాష్ట్రం కాబట్టి చాలా సమస్యల్లో ఉన్నామనీ, కేంద్రం సాయం చేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు కోరారు. రైల్వే జోను ఏర్పాటు చేయాలని కోరామనీ, రెవెన్యూ లోటు భర్తీకి ఇస్తామన్న నిధులను విడుదల చేయాలని అడిగానంటూ చంద్రబాబు చెప్పారు. ఈ డిమాండ్లపై ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు.
నిజానికి, ఇదేమైనా కొత్త విషయమా చెప్పండీ..! గడచిన మూడున్నరేళ్లలో ఆంధ్రాకి కేంద్రం విదిల్చిందేం లేదు. ఆ విషయం చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా వినిపిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీని పరిపూర్ణంగా అమలు చేయాలని కోరామన్నారు… అంటే, ప్యాకేజీకి ఇప్పటికీ స్పష్టత రాలేదని ఆయన చెప్తున్నట్టు! రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే ఇంతవరకూ రూ. 4 వేలు కోట్ల మాత్రమే కేంద్రం ఇచ్చిందనీ, మరో రూ. ఏడున్నర కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఇది ఎప్పటికి వస్తుందనేది ఒక ప్రశ్న అయితే, రెవెన్యూలోటు పూర్తిగా తీర్చేందుకు అవసరమైన నిధులు ఇప్పట్లో రావానేది అంతర్లీనంగా చంద్రబాబు చెబుతున్నారు. ఇక, 11 విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో గోడలు కట్టిందన్నారు, కేంద్రం నిధులు ఇవ్వలేదనీ చెప్పారు. ప్రాజెక్టుల విషయానికొస్తే… పెట్టుబడులు ఈఏపీ ద్వారా రావడం అలస్యం అవుతుందనీ, నాబార్డు వంటి ఇతర వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణసాయం చేయాలనీ చంద్రబాబు కోరారు.
ఏతావాతా అర్థమౌతున్నది ఏంటంటే… గడచిన మూడున్నరేళ్లలో ఆంధ్రా విషయంలో కేంద్రం ప్రత్యేకంగా చేసిందేం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, అది కూడా భాజపాకీ ఇజ్జత్ కా సవాల్ కాబట్టి అడపాదడపా నిధులు విదుల్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇవ్వాల్సిన కొన్ని నిధులను విడుదల చేస్తున్నారు. కానీ, ఇన్నాళ్లు గడిచాక కూడా ఇంకా వినతి పత్రాలంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అంతకుమించి ఏం చేస్తారు అనే అనుకోవచ్చు! కేంద్రం కూడా అదే ధీమాతో ఉందేమో మరి. ఓ పక్క బడ్జెట్ రూపకల్పన పూర్తయిపోతున్న చివరి దశలో ఆంధ్రాకి పెద్ద పీట వేయాలని కోరితే ఎంతవరకూ ప్రయోజనం ఉంటుంది..? కొద్దిరోజుల కిందట విజయవాడలో రైల్వే అధికారులు ఏపీ ఎంపీలతో సమావేశం పెడితే… బడ్జెట్ తయారైపోయాక తమతో చర్చలేంటీ అంటూ టీడీపీ ఎంపీలే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి, ఈ దశలో అరుణ్ జైట్లీని సీఎం కలిసి, ఆంధ్రాకు కేటాయింపులు పెంచండీ అంటే… ఇది కూడా అలాంటి రొటీన్ మీటింగే అవుతుంది కదా! ఏపీ వినతులకు కేంద్రం స్పందిస్తుందన్న ఆశ లేదుగానీ… రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి, భాజపాకి మేలు చేకూర్చే విధంగా బడ్జెట్ లో కొన్ని ఆకర్షణలు ఉంటాయి. వాటిలో భాగంగానైనా ఏపీకి ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఒక్క చిన్న ఆశ మాత్రం ఉంది, అంతే!