తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చాలా మంది కమెడియన్స్ హీరోలుగా నటించారు. నాటి పద్మనాభం, రాజబాబు వంటి కమెడియన్స్ నుంచి ఇప్పటి కమెడియన్స్ వరకు ఎంతో మంది హీరోలుగా నటించారు. అయితే కొంతమంది సక్సెస్ అయ్యారు, మరికొంత మంది ఫెయిల్ అయి కమెడియన్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న కమెడియన్స్‌లో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, ధన్‌రాజ్, సునీల్ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వీరిలో మొదట సక్సెస్ అయింది ఆలీ ఒక్కడే. బ్రహ్మానందం, వేణుమాధవ్, ధన్‌రాజ్‌లు మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక సునీల్ విషయానికి వస్తే హీరోగా అతని కెరీర్ నత్త నడక నడుస్తోంది. ఇప్పటివరకు అతను హీరోగా నటించిన సినిమాలు అతని హీరో కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఇదిలా వుంటే ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా వచ్చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అతనెవరో కాదు సప్తగిరి. సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సాగర్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వి.వి.వినాయక్, శ్రీను వైట్ల, రవికుమార్ చౌదరి, జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారట. మిగతా కమెడియన్స్ విషయం పక్కన పెడితే సప్తగిరికి మాత్రం ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్‌గా కొనసాగుతున్న డైరెక్టర్స్ నిర్మాతలుగా మారి సప్తగిరిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఇది నిజంగా గొప్ప విశేషమే.