హైదరాబాద్: నెల్లూరుకు చెందిన రాజకీయ ప్రముఖులు ఆనం సోదరులు 2,000 మంది అనుచరులతో సహా ఇవాళ లాంఛనంగా తెలుగుదేశంపార్టీలో చేరారు. విజయవాడలో ఏ 1 కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో – సంచలనాలకు మారుపేరైన ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ జగన్కు చురకలు అంటించటంతోపాటు చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. జగన్ గెలవకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. జగన్ గొప్ప ఆర్థికవేత్త అని, కౌటిల్యుడు, కారల్ మార్క్స్ వంటివారు జగన్ ముందు దిగదుడుపేనని ఎద్దేవా చేశారు. జగన్ పెట్టుబడి ఏమీ లేకుండానే లక్షకోట్లు సంపాదించారని, ఆయన ఎకనామిక్ థియరీలో పెట్టుబడి ఉండదని, లక్షకోట్ల లాభం మాత్రం ఉంటుందని అన్నారు. ఒకసారి విభజన ద్రోహం ఏపీ ప్రజలను వెంటాడుతున్నా, రేపటితరంకోసం యుద్ధం చేసే ఒక దళపతి లభించటం అదృష్టమని చెప్పారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని రామారావు సినిమాలో ఒక పాట ఉందని, ఇకనుంచి కృషి ఉంటే మనిషులు చంద్రబాబునాయుడు అవుతారని నానుడి రాబోతోందని వివేకా అన్నారు. చంద్రబాబు లోకం చుట్టివచ్చిన్ లోకనాయకుడని వ్యాఖ్యానించారు.