ఒకేరోజు.. రెండు సమావేశాలు జరిగాయి. రెండు చోట్లా గమనించాల్సిన అంశం.. ఆంధ్రులు – అభివృద్ధి! ఒక వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రాతో తమకు పోలికే లేదనీ, తాము ఎంతో అభివృద్ధి చెందామంటూ చెప్పారు. మరో వేదికపై హైదరాబాద్ అభివృద్ధి కారణం ఆంధ్రులే అన్నట్టుగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు! ఈ రెండూ వేర్వేరుగా జరిగిన సమావేశాలే అయినా… ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం!
ఇండియా టుడే మీడియా గ్రూప్ హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆద్యంతం తెలంగాణను ప్రమోట్ చేసుకునేందుకే ఈ వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకున్నారని చెప్పొచ్చు. రాజ్దీప్ అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన విభేదిస్తూనే మాట్లాడారు. విభజన తరువాత తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. తెలంగాణను పునర్మించుకున్నామన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ అభివృద్ధి గడచిన మూడున్నరేళ్లలో సాధించుకున్న ఘనత అని చెప్పారు. సొంత ఆర్థిక వనరుల విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకంటే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. చాలా అంశాల్లో ఇప్పుడు దేశంలోనే మిన్నగా తెలంగాణ నిలుస్తోందన్నారు. తెలంగాణ ఎప్పట్నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉందన్నారు. ఆంధ్రాతో ఎలాంటి పోలికా లేదన్నారు. చాలా విషయాల్లో తాము చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకుంటున్నామన్నారు. ఇలా బ్రాండ్ తెలంగాణ ప్రచారం కోసం ఈవేదికను వాడుకున్నారు.
ఇక, విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడారు. హైదరాబాద్ కోల్పోవడం వల్లనే ఆంధ్రాకు ఆదాయం తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పన్నులు చెల్లిస్తున్నవారిలో 40 శాతం మంది ఆంధ్రులే ఉన్నారని చెప్పారు. ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వారి వల్లనే వస్తోందన్నారు. ఆ స్థాయిలో ఆదాయం ఆంధ్రాకి వస్తే, ఇక్కడ సమస్యలే ఉండవని ఆయన అభిప్రాయపడటం విశేషం!
తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా రాష్ట్ర సాధన తరువాతే జరిగినట్టు కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే స్థాయికి హైదరాబాద్ ఎదిగిందంటే కారణం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే కదా! హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటివి ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా జరిగినవే కదా. కొద్దిరోజుల కిందట మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భాగ్య నగరానికి తరలిరావడం వెనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎప్పటికీ మరచిపోలేనిది అని కొనియాడారు. సరే, చంద్రబాబు పేరు చెప్పడం ఇష్టం లేకపోయినప్పుడు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కొంత అభివృద్ధి జరిగిందనే మాట కూడా కేసీఆర్ చెప్పకపోవడం కొంత విచారకరమే!
హైదరాబాద్ లో వసూళ్లు అవుతున్న పన్నులో 40 శాతం ఆంధ్రులే కడుతున్నారని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడే చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే, వీరంతా ఆంధ్రాకి తిరిగి వెళ్తారా అనేది చర్చ కానే కాదు. అది ఆచరణ సాధ్యమూ కాదు. వాస్తవాలు ఇలా ఉన్నాయి కదా… మరి కేసీఆర్ ఈ మాట ఎక్కడా చెప్పలేదే అనేది మాత్రమే చర్చ. మూడున్నరేళ్లలో కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేనది కూడా ఎవ్వరూ అనరు. కాకపోతే, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడి ఉంటే మరింత హుందా ఉండేది అనేది కొంతమంది అభిప్రాయం.