ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇడుపులపాయలో మొదలైన జగన్ యాత్ర ప్రస్తుతం కాళహస్తి వరకూ చేరనుంది. గడచిన అరవై రోజుల్లో ప్రతీ జిల్లాలోనూ దాదాపుగా ఏడు నియోజక వర్గాలు కవర్ చేస్తూ యాత్ర సాగించారు. దాదాపు యాభైకి పైగా నియోజక వర్గాల ప్రజలను జగన్ కలుసుకున్నారు. తెలుగుదేశం సర్కారుపై విమర్శలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే కార్యక్రమాల గురించి ప్రచారం చేశారు. హామీలు గుప్పించారు. అయితే, ఓపక్క పాదయాత్ర ఇలా సాగుతుంటే… ఇదే సమయంలో వైకాపా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. జగన్ పాదయాత్రలో పీకే టీమ్ చేస్తున్న హడావుడి చూస్తున్నాం. పాదయాత్ర జరిగిన ప్రదేశంలో ప్రజల స్పందన తెలుసుకోవడం, జగన్ ఇస్తున్న హామీలపై జనం ఏమనుకుంటున్నారూ, ప్రతిపక్ష నేత ప్రసంగాలను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తూ సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ నివేదికలు కేవలం జగన్ కు మాత్రమే పరిమితం అనే సంగతి తెలిసిందే కదా!
అందుకే, ఇప్పుడు కొంతమంది ప్రముఖ వైకాపా నేతలు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్టు సమాచారం. జగన్ పాదయాత్ర ప్రభావం ఆయా నియోజక వర్గాల్లో ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట! కొన్ని సర్వే సంస్థలను రంగంలోకి దించారనీ, జగన్ పాదయాత్ర చేసి వెళ్లిపోయాక.. ప్రజల స్పందన ఎలా ఉందీ, హామీలు ఎంతవరకూ ఆకర్షణీయంగా పనిచేస్తున్నాయనే అంశాలపై సర్వే జరిగినట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాలో నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లు, స్థానిక నేతలకు తెలియకుండా ఈ సర్వేలు జరిపించినట్టు సమాచారం! జగన్ పాదయాత్రపై జిల్లాల వారీగా చూసుకుంటే… కొన్ని చోట్ల అనూహ్యమైన స్పందన, మరికొన్ని చోట్ల మిశ్రమ స్పందన ఉన్నట్టుగా సదరు సర్వేల్లో తేలినట్టు వినిపిస్తోంది. కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర ప్రభావం కొంత సంతృప్తిగా ఉందని తేలిందట! చిత్తూరు జిల్లాలో ఊహించినదానికంటే పాదయాత్ర ప్రభావం ఎక్కువే వచ్చిందట. ఇక, అనంతపురంలో స్థానిక నేతల మధ్య సమన్వయ లోపంతో జగన్ యాత్రకు ఆశించిన స్పందన రాలేదని తేలిందట.
హామీల విషయానికొస్తే.. అన్ని వర్గాల ప్రజలకు అవి చేరలేదనేది సదరు సర్వేలో తెలిసినట్టు చెబుతున్నారు! జగన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న నవరత్నాల హామీ అన్ని వర్గాలకూ స్పష్టంగా అర్థం కావడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఇక, కేడర్ విషయానికొస్తే… స్థానిక నాయకత్వంలో లోపాలు స్పష్టంగా కనిపించాయట! కిందిస్థాయిలో గ్రూపుల బెడద పొంచి ఉందనీ, తమ నియోజక వర్గానికి జగన్ వచ్చినా కేవలం సెల్ఫీలకు మాత్రమే సమయం ఇచ్చారనీ, పార్టీ పరిస్థితి గురించి ఒక నిమిషమైనా మాట్లాడలేదనే అసంతృప్తి కిందిస్థాయి నేతల్లో వ్యక్తమౌతున్నట్టు సమాచారం. స్థూలంగా, ఇంతవరకూ జగన్ పర్యటించిన జిల్లాలో పరిస్థితి ఇలా ఉందనేది సదరు సర్వేల ద్వారా వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వైకాపా కోసం వ్యూహకర్తగా నియమించుకున్న పీకే సర్వేలకు సమాంతరంగా కీలక నేతలు ప్రజాభిప్రాయ సేకరణకు దిగడం. సమన్వయ లోపం ఇక్కడే కనిపిస్తోంది కదా! పీకే నిర్వహిస్తున్న సర్వేలు జగన్ కు, ఆయన సతీమణికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఆ ఫీడ్ ఏదో కనీసం కీలక నేతలకైనా అందించి ఉంటే ఈ పరిస్థితి ఉండదు. పీకే టీమ్ నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టూ కథనాలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే… అందరూ జగన్ కోసమే పనిచేస్తున్నారు, ఎవరికివారు సొంతంగా పని చేసుకుంటున్నారు.