‘ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సాయం’… ఇదో బ్రహ్మపదార్థంలా తయారైంది! ఇస్తాం ఇస్తాం అంటూ కేంద్రం ఏమిస్తోందో ఎంత ఇస్తోందో తెలీదు. తెస్తాం తెస్తాం అంటూ రాష్ట్రం ఏం తెస్తోందో ఎంత తెచ్చిందో అర్థం కావడం లేదు! మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సీఎం చంద్రబాబు ఓ వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రాకు పేద్ద పీట వేయాలని, భారీ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. ఆ తరువాత, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల కూడా ఇదే మాట చెప్పారు. ఈసారి కేంద్రం భారీ ఎత్తున కేటాయింపులు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నట్టు ప్రకటనలు చేశారు.
ఇప్పుడు కొత్తగా… రాష్ట్రానికి న్యాయం జరగకపోతే న్యాయపోరాటం అంటున్నారు! ఈ మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో జరిగి కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ… విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్లనే ఆంధ్రాకు ఇప్పుడీ ఇబ్బందులు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రస్థావన కూడా వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దక్షిణ భారతదేశంలో అత్యల్ప తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఇప్పుడు ఆంధ్రా ఉందనీ, దీనికి కారణం విభజనలో సహేతుకత లోపించడమే అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన కనీస అవసరాలను మాత్రమే కేంద్రం నుంచి కోరుతున్నామనీ, ఎక్కువేమీ అడగడం లేదని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో ఉన్నవి ఇవ్వాలని కోరుతున్నామనీ, పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అన్నారు. ఒకవేళ రాష్ట్రానికి న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకైనా వెళ్తామని ఆయన చెప్పడం విశేషం!
‘రాష్ట్రానికి కేంద్రం సాయం’ అనే ఈ అంశంపై చంద్రబాబు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుండటం గమనార్హం! సంయమనం పాటిస్తూనే కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలని కొన్ని సందర్భాల్లో చెబుతుంటారు. కేంద్రంతో కయ్యానికి వెళ్లకూడదనీ, మిత్రధర్మం పాటించాలని అంటారు. ఇప్పుడేమో.. అవసరమైతే సుప్రీం కోర్టు వరకూ వెళ్తామని చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్తే వినతి పత్రాలతో వెళ్తారు. కేంద్రంలోని పెద్దలు సానుకూలంగా స్పందించారనీ, రేపోమాపో సాయం చేసేస్తారన్నట్టుగా అక్కడ మాట్లాడతారు. తీరా, రాష్ట్రానికి వచ్చేసరికి… కేంద్రం చేయాల్సింది చాలా ఉందీ, కేంద్రం బాధ్యతలు ఇవీఅవీ అంటూ ఇలా మాట్లాడుతుంటారు! ఇంతకీ కేంద్రం సాయం చేస్తోందా… చేస్తే ఎప్పుడు చేస్తుంది.. ఎంత చేస్తుంది.. ఎలా చేస్తుంది.. వీటిపై కేంద్రం ఇచ్చిన స్పష్టత ఏంటనేది చెబితే ప్రజలకు అర్థమౌతుంది. తలసరి ఆదాయంలో వెనుకబాటుకు గత ప్రభుత్వాల అసంబద్ధ విభజనే కారణం, విభజనానంతరం అభివృద్ధి జరకపోవడానికి భాజపా వైఖరే కారణం… రెండిటికీ రెండు కారణాలు దొరికేశాయని చంద్రబాబు సరిపెట్టుకుంటున్నారా అనే అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం మున్ముందు ఉంది. ఇప్పటికీ కేంద్ర సాయంపై స్పష్టత రాబట్టకపోతే ఎలా..?