ఇండియా టుడే హైదరాబాదులో నిర్వహిస్తున్న కాన్క్లేవ్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణల మధ్య కొత్త వివాదం సృష్టించింది. హౌస్ట్ రాజ్దీప్ సర్దేశాయి ఇరురాష్ట్రాల విభజన ఉద్యమ ఉద్రిక్తతలు వివాదాల తీవ్రతను మర్చిపోయి ప్రశ్నలు వేయడం ఇందుకు కారణమైంది. అదే అవకాశమనుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలి సామరస్య గీతాలను కాస్త పక్కనపెట్టి పాత తరహా పల్లవి ఆలపించడానికి అవకాశం లభించింది. హైదరాబాద్ అభివృద్ధి నుంచి తెలుగు అస్తిత్వం వరకూ కెసిఆర్ మాట్లాడినవన్నీ పాత ఫక్కీలో వున్నాయి. దీనికి మరో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తగు రీతిలోనే సమాధానమివ్వడంతో చర్చ మొదటికి వచ్చి కూచుంది. ఇదే అదనుగా వివాదం రగిలించే రాజకీయ శక్తులకు ఎలాగూ లోటు లేదు.వాస్తవానికి జాతీయ పార్టీలైనకాంగ్రెస్ బిజెపిలు ఎక్కడిమాటలక్కడ మాట్లాడ్డంలో ఆరితేరాయి. గవర్నర్ను మార్చాలని విష్ణుకుమార్రాజు చేస్తున్న హడావుడి అందులో భాగమే. నిజానికి ఆయన వెనక చంద్రబాబు వున్నారని బిజెపి వర్గాలు సందేహిస్తున్నాయి. విభజన సమస్యలపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా మోడీపై తిరుగుబాటులా చూపేందుకు కొందరు ప్రయాసపడుతున్నారు.కాని టిడిపి అధికార ప్రతినిధులు బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. ఉభయ చంద్రులూ ప్రధాని మోడీతో మంచిగానే వుండాలనుకుంటున్నారు గనక చివరకు మిగిలే రాజకీయం పాత గాయాలను కెలుక్కోవడం, ప్రాంతీయ వాదాలను మోగించడం మాత్రమే. కాన్క్లేవ్ అందుకు మంచి అవకాశం కల్పించింది. దీనిపై ప్రకటనలూ ప్రలాపాలూ చూడబోతున్నాం.