ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు ఇప్పుడు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సూచించడం సంచలనమైంది. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఎమ్మెల్యేలంతా క్యాబినెట్ హోదా పదవులు పొందారన్న అంశమే ఇప్పుడు చర్చనీయం అయింది. దీనిపై రాష్ట్రపతి స్పందన ఎలా ఉంటుందనేదే ఉత్కంఠ. అయితే, ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ స్ఫూర్తితో కేసీఆర్ సర్కారుపై పోరాటానికి తెర తీస్తోంది. ఢిల్లీ మాదిరిగానే తెలంగాణలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
తాజా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… ప్రజల నుంచి ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి, ఇంకో లాభదాయకమైన హోదాను అనుభవించడం చట్ట విరుద్ధమని రేవంత్ అన్నారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన హోదాల్లో ఎవరైనా ఉంటే వారిని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేశారు. శాసన సభలో ఉన్న సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని 15 శాతమే క్యాబినెట్ హోదా ఇవ్వాలనీ, ఆ లెక్క ప్రకారం కాకుండా, అదనంగా ఆరుగురు శాసన సభ్యులను పార్లమెంటు సెక్రటరీలుగా కేసీఆర్ నియమించి క్యాబినెట్ హోదా కల్పించారనీ, ఇది చట్ట ఉల్లంఘన అని రేవంత్ అన్నారు. ఇదే అంశమై తాను గతంలో హైకోర్టును ఆశ్రయించాననీ, పార్లమెంటు సెక్రటరీల నియామకం చట్ట విరుద్ధమని నాడు కోర్టు తీర్పు ఇచ్చిందని రేవంత్ చెప్పారు. అంతేకాదు… ఇకపై తమ అనుమతి లేకుండా ఎలాంటి నాయామకాలూ చేపట్టొద్దని కేసీఆర్ సర్కారుకు కోర్టు స్పష్టం చేసినా, వాటినీ పెడచెవిన పెట్టి మరో 21 మందిని నియమించేశారన్నారు. దానిపై కూడా ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ప్రజలతోపాటు చివరికి న్యాయస్థానానికి కూడా కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో తాజా పరిణామాలను ఊటకింస్తూ.. ‘చట్టం, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి కార్యాలయం చెబుతున్నది ఏంటంటే, శాసన సభ్యులుగా ఉన్నవారు పార్లమెంటు సెక్రటరీలుగా, లేదా ఇతర క్యాబినెట్ హోదాలు పొందడం చట్ట విరుద్ధమని స్పష్టమైంద’ని రేవంత్ చెప్పారు. ఇదే లెక్కన తెరాసకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించాలన్నారు. వారిని పార్లమెంటు సెక్రటరీలుగా మాత్రమే కేసీఆర్ తొలగించారుగానీ, అనర్హులుగా ప్రకటించలేదని రేవంత్ గుర్తు చేశారు. ఇదే అంశంపై సోమవారం నాడు ఈసీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేయబోతున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. వీళ్లే కాదు… మరో 21 మందికి అదనంగా కేసీఆర్ సర్కారు హోదాలు కల్పించిందనీ, హైకోర్టులో ఉన్న ఈ కేసును స్పెషల్ మెన్షన్ కింద పరిగణించి, వెంటనే జడ్జిమెంట్ ఇవ్వాలంటూ తమ న్యాయవాదుల ద్వారా వాదించబోతున్నామని చెప్పారు. కోర్టు నుంచి మొట్టికాయలు తినేలోగా ముఖ్యమంత్రి స్పందించి, వీరిపై చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ డిమాండ్ చేశారు. మొత్తానికి, ఢిల్లీ స్ఫూర్తితో ఒక బలమైన పోరాటాంశాన్నే టి. కాంగ్రెస్ నేతలు ఎత్తుకున్నారు. అయితే, ఈ అంశాలపై ఈసీ, హైకోర్టు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.