నాలుగు నెలలుగా పవన్ కళ్యాణ్ పై, తన ఫ్యాన్స్ పై కత్తులు నూరుతున్న క్రిటిక్ కత్తి మహేష్ ఎట్టకేలకి వివాదానికి తెర దించాడు. పవన్ ఫ్యాన్స్ తో సయోధ్య కుదిరిందని, తన డిమాండ్స్ కొంతవరకు నెరవేరాయని, ఇక పై పవన్ పై, వ్యక్తిగత విమర్శలు చేయనని టివి ఛానెళ్ళ సాక్షిగా ప్రకటించేసాడు. అసలు ఒక్క 24 గంటల క్రితం తీవ్ర సమస్యలా ఉన్నదాన్ని, 24 గంటల తర్వాత పూర్తి సమసిపోయిందనేలా ఇటు కత్తి మహేష్, అటు పవన్ ఫ్యాన్స్ (ముఖ్యంగా కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన తరపున చాలా డిబేట్ల లో పాల్గొన్న వ్యక్తి) ప్రవర్తించారు, ఒకరికొకరు లైవ్ లో స్వీట్లు తినిపించుకున్నారు. అసలేం జరిగింది? ఎలా పరిష్కారమైంది ?
ఇటీవల కొందరు యువకులు కత్తి మహేష్ పై కోడి గుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిపై కత్తి మహేష్ పోలీస్ కేసు పెట్టడం, దాడి చేసిన ఆ యువకులు తెరపైకి వచ్చి తామే దాడి చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన డిబేట్ ల లోనూ, ఆ యువకులు టివి ముందుకు రావడానికి ముందు జరిగిన డిబేట్ ల లోనూ ఎప్పటిలాగానే తీవ్రంగా మాట్లాడాడు కత్తి మహేష్. తనపై జరిగిన దాడిని తీవ్రంగా ఆక్షేపించాడు. కానీ మహా టివి ప్రోగ్రాం లో కళ్యాణ్ దిలీప్ సుంకర, శేఖర్ ల సమక్షం లో జరిగిన డిబేట్ లో సీన్ మొత్తం రివర్స్ అయింది. సీనియర్ జర్నలిస్ట్ “మూర్తి” ప్రయోక్త గా జరిగిన ప్రోగ్రాం లో కేసు వాపస్ తీసుకోవడానికి అంగీకరించాడు కత్తి మహేష్. దాడి చేసిన యువకులు టీనేజర్స్ అనీ, అందులో ఒకరు దళితుడేనని, ఒకరు 7వ తరగతి, మరొకరు 10 వరకు మాత్రమే చదువుకున్నారనీ, ఇద్దరూ కూడా నిరుపేద కుటుంబాలనుంచి వచ్చినవారేననీ, కానీ ఇలా దాడి సబబు కాదని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కత్తి మహేష్ కి వాళ్ళ చేత సారీ చెప్పిస్తాననీ “మూర్తి” రాయబారం నడిపేసరికి కాస్త మెత్తబడ్డాడు కత్తి మహేష్. అటు కళ్యాణ్ దిలీప్ కూడా అభ్యర్థనా పూర్వకంగా మాట్లాడేసరికి, కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. వెను వెంటనే మహా న్యూస్ ఛానెల్ నుంచి అటే స్టేషన్ కి వెళ్ళడమూ, కేసు వెనక్కి తీసుకోవడమూ జరిగిపోయాయి. కేసు వెనక్కి తీసుకోవడమే కాక ఇకపై పవన్ విషయం లోనూ, జనసేన విషయం లోనూ సంయమనం పాటిస్తానని ఛానెల్ సాక్షి గా చెప్పడం తో ఒక్కసారిగా సమస్య సద్దుమణిగినట్టయింది. ఉన్నపాటుగా “కత్తి సయోధ్య దిశగా మాట్లాడిన ఈ విషయం” సోషల్ మీడియాలో వైరల్ అవడమూ, మూర్తి మీద ప్రశంసల వర్షం కురవడమూ జరిగిపోయాయి. ఒక యాంకర్ “మోడరేటర్” గా వ్యవహరిస్తే అనవసర రాద్దాంతాలు ఎంత సులువు గా పరిష్కరించబడతాయో అంటూ మూర్తి ని ప్రశంసించారు పవన్ ఫ్యాన్స్. కోన వెంకట్ కూడా “నెలల తరబడి సాగుతున్న ప్రశ్నకి పరిష్కారం చూపినందుకు గానూ మూర్తి కి, మహా న్యూస్ కి థ్యాంక్స్” చెబుతూ ట్వీట్ చేసారు.
అదే విధంగా జనసేన నుంచి అఫీషియల్ గా, అభిమానులని సంయనం పాటించాలని రిలీజ్ అయిన ప్రెస్ నోట్ కారణంగా తన డిమాండ్ పాక్షికంగా నెరవేరిందని, తాను ఎదురు చూసిన స్పందన వచ్చినందున ఈ సమస్య కి ముగింపు పలుకుతున్నాననీ కత్తి మహేష్ స్వయంగా ప్రకటించడం తో ఈ సమస్య కి దాదపు తెర పడ్డట్టయింది. అయితే ఇది తెర మీద కనిపించిన వ్యవహారం. ఫలానా ఛానెల్ వేదిక గా ఫలానా సమయం లో ఇలా సయోధ్య కుదిరిందని తెలియజేస్తుంది. కానీ అసలు ఈ సమస్యకి ఇప్పట్లో పరిష్కారం దొరకదనీ భావించినవారందరికీ ఇది ఎలా పరిష్కారం దొరికిందన్నది, దీనికోసం తెర వెనక ఏం జరిగిందన్నది పెద్ద మిస్టరీ గా మిగిలింది. ఇంతకీ తెర వెనుక ఏం జరిగింది ? (part-2 to continue)
ZURAN