టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… ప్రభాస్. తన పెళ్లికి సంబంధించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలొస్తున్నాయి. కృష్ణంరాజు కూడా ఈ విషయంపై చాలా సందర్భాల్లో స్పందించారు. ‘బాహుబలి పూర్తయ్యాక చేసేస్తాం’ అన్నారు. బాహుబలి 1 వచ్చింది వెళ్లిపోయింది, 2 వచ్చింది వెళ్లిపోయింది. ఇప్పుడు సాహో.. పనుల్లో పడిపోయాడు. అయినా ప్రభాస్ పెళ్లి కబురు బయటకు రాలేదు. ఈమధ్య ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ని అడిగితే.. ‘నా చేతుల్లో ఏం లేదు’ అన్నట్టు మాట్లాడారు. అది కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి నేనే దగ్గరుండి చేస్తా.. అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయనే చేతులెత్తేయడం విడ్డూరంగా అనిపిస్తోంది.
ప్రభాస్ పెళ్లి గురించి కృష్ఱంరాజునే కాదు, అతని సన్నిహితులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి అంత సుముఖుంగా లేడన్నది వాళ్ల మాట. దానికీ ఓ కారణం ఉందట. ప్రభాస్ మనసులో ఎవరో ఉన్నారని, చేసుకుంటే వాళ్లనే పెళ్లి చేసుకోవాలన్నది ప్రభాస్ ఆలోచన అని, కానీ అది కృష్ణంరాజుకి ఇష్టం లేదని… అందుకే.. పెళ్లి మాటెత్తే సరికి అటు ప్రభాస్, ఇటు కృష్ణంరాజు జారు కుంటున్నారని తెలుస్తోంది. పెదనాన్నకి ఇష్టం లేకుండా ప్రభాస్ ఏ పనీ చేయడు. అందుకే.. తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్నాడన్నది టాక్.
ప్రభాస్ మనసులో ఎవరున్నారు? అనేది మరో అంతులేని ప్రశ్న. అనుష్కతో ప్రభాస్‌కి లింకులు పెడుతూ చాలా వార్తలొచ్చాయి. వాటిని ఇద్దరూ యధావిధిగా ఖండించారు. అనుష్క తాజా ఇంటర్వ్యూలలోనూ ప్రభాస్ ప్రస్తావన వచ్చింది. ప్రభాస్‌తో పెళ్లటగా… అంటే తనేం సీరియెస్ అయిపోలేదు. కూల్‌గానే సమాధానం ఇచ్చింది. ‘జనాలు అలా అనుకోవడంలో తప్పులేద’ని తేల్చేసింది. తాను పని చేసిన హీరోయిన్ల కంటే ప్రభాస్ అనుష్కతోనే క్లోజ్‌గా ఉంటాడన్నది మీడియా సర్కిళ్లలో వినిపించే మాట. ఆ లెక్కన చూసినా.. ఇప్పటి వరకూ వీరిద్దరిపై పుట్టుకొచ్చిన వార్తలన్నీ కేవలం గాలి వార్తలుగా కొట్టి పారేయలేం. ప్రభాస్, అనుష్కల పెళ్లి లేట్ అవుతున్న కొద్దీ.. ఈ పుకారుకు బలం వస్తూనే ఉంటుంది. ఇద్దరిలో ఎవరి పెళ్లి సెట్ అయినా.. ఈ వార్తలకు భరత వాక్యం పలికినట్టు అవుతుంది.