జనసేన కోసం పవన్ కల్యాణ్ ఇప్పుడు పాద యాత్రకు శ్రీకారం చుడుతున్నాడు. అయితే… ఇప్పటికే పవన్ మరో యాత్ర చేసేశాడు. అదే… ఓదార్పు యాత్ర. అది మాత్రం తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ కోసం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి కనీ వినీ ఎరుగని రీతిలో ఫ్లాప్ అయ్యింది. ”అయ్యో.. పవన్ సినిమా ఇంత దారుణంగా ఉందేంటి?” అని తెగ ఫీలైపోయిన అభిమానులు… చివరాఖరికి త్రివిక్రమ్‌ని ప్రధమ ముద్దాయిగా తేల్చేశారు. పవన్ స్టామినాకు తగిన కథ త్రివిక్రమ్ రాసుకోలేదని, ఈ సినిమా ఫ్లాప్‌కి నూటికి నూరుపాళ్లూ త్రివిక్రమే బాధ్యుడన్నది పవన్ అభిమానుల మాట. ఇవన్నీ త్రివిక్రమ్ గమనిస్తూనే ఉన్నాడు. అందుకే… నష్ట నివారణ చర్యల్లో భాగంగా తన పారితోషికంలోంచి కొంత వెనక్కి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఆర్థికంగా నిర్మాతలకు, పంపిణీదారులకు అండగా నిలవాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. పవన్ మాత్రం ఇప్పటికీ త్రివిక్రమ్‌నే నమ్ముతున్నాడట. అజ్ఞాతవాసి తరవాత పవన్ – త్రివిక్రమ్‌లు దూరం దూరంగానే ఉన్నారు. అయితే రెండ్రోజుల క్రితమే.. పవన్ త్రివిక్రమ్‌ని పరామర్శించాడని అత్యంత సన్నిహితులు చెబుతున్నమాట. జయాపజయాలు మన చేతుల్లో లేవు.. అంటూ వేదాంత ధోరణిలోనే మిత్రుడ్ని ఓదార్చాడట. ”ఈ ఫ్లాప్ మన బంధంపై ఎలాంటి ప్రభావం చూపించదు” అని మిత్రుడికి కావల్సినంత ధైర్యం అందించాడని, త్రివిక్రమ్ కూడా ఇప్పుడిప్పుడే ఈ ఫ్లాప్ నుంచి కోలుకుని… ఎన్టీఆర్ సినిమాపై దృష్టి నిలపడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. త్రివిక్రమ్‌ని ఓదార్చాడు సరే. మరి అభిమానుల మాటేంటి? ఇప్పుడు జరుగుతున్న పాద యాత్ర.. ఓ విధంగా ‘అజ్ఞాతవాసి’ ఓదార్పు యాత్ర అనుకోవాలా?? పవన్ అభిమానులు ఇలా భావించినా తప్పులేదేమో.