జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి యాత్రకు బయలుదేరుతున్నారు. ఆ మధ్య ఆంధ్రాలో మూడు రోజులు యాత్ర చేసిన సంగతి తెలిసిందే. పలు అంశాలపై మాట్లాడారు. అదే క్రమంలో తెలంగాణలో కూడా తన పర్యటన ఉంటుందని అప్పుడే పవన్ అన్నారు. తదనుగుణంగానే తెలంగాణ పర్యటనకు వెళ్తున్నారు. ముందుగా 22న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి యాత్ర మొదలై, నాలుగు రోజులపాటు మూడు జిల్లాలను కవర్ చేస్తూ సాగుతుందని చెప్పారు. యాత్ర ఏయే ప్రాంతాల్లో ఉంటుందనేది కూడా కొండగట్టులోనే పవన్ ప్రకటిస్తారు. ఇంతకీ, ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే.. ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం కోసమే అని జనసేన వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రైతులు సమస్యలతోపాటు, గల్ఫ్ వలసల సమస్య వంటి వాటిపై పవన్ ముందుగా దృష్టి సారించే అవకాశం ఉందని కొందరు అభిమానులు చెబుతున్నారు.
సరే, తెలంగాణలో పవన్ పర్యటన ఎలా ఉండబోతోందనేది కాసేపు పక్కనపెడితే.. ఆ మధ్య ఆంధ్రాలో కూడా ఇలానే పర్యటించారు. కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. కృష్ణా నదిలో పడవ ముగిని చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి, త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్భోదించారు. విజయవాడలో కుల రాజకీయాల గురించి, వంగవీటి హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఆంధ్రాలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై జనసేన పార్టీ అభిప్రాయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి, ఆంధ్రాలో యాత్ర మొదలు కాకముందు పవన్ చెప్పిందేంటంటే… తెలుగు రాష్ట్రాల్లూ పర్యటిస్తానూ, సమస్యలపై అధ్యయనం చేస్తానూ, మొత్తంగా మూడు దశలు ఉంటాయని చెప్పారు కదా. తొలి దశలో సమస్యల పరిశీలన, అవగాహన అధ్యయనం అన్నారు. మలి దశలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు అన్నారు. తుది దశలో… తాము లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సమరం అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి, ఆ మూడు రోజులపాటు ఆంధ్రాలో పర్యటించారు కదా! దాన్ని తొలి దశగా అనుకోవచ్చా..? ఒకవేళ అదే తొలి దశ అయితే.. జరిగిన అధ్యయనం ఏంటీ, పెరిగిన అవగాహన ఏంటీ… చేసిన పరిశీలన ఏంటి..? ఇవేవీ జనసేన ఇంతవరకూ చెప్పలేదు. ఆంధ్రాలో రెండో దశ… అనగా, గుర్తించిన సమస్యలపై ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి చర్చించడం ! అవి ఎప్పుడుంటాయి, అసలు ఉంటాయా లేదా అనేది కూడా చెప్పలేదు. ఆంధ్రాలో ఆ మూడు రోజుల పర్యటన జనసేనకు ఏ విధంగా ఉపయోగపడిందనేది కూడా తెలీదు..!
ఇప్పుడు వ్యక్తమౌతున్న అనుమానం ఏంటంటే… మూడు విడతల్లో దశలవారీగా తన పర్యటన సాగుతుందని గతంలో ప్రకటించిన విషయం జనసేనానికి గుర్తుందా లేదా అనేది! ఆంధ్రా పర్యటనానుభవాలపై స్పష్టత ఇవ్వకుండా.. ఇప్పుడు తెలంగాణ షెడ్యూల్ ప్రకటించేశారు. ఆంధ్రాలో ఆయన అధ్యయనం చేసిందేముందీ… కొన్ని అంశాలపై పవన్ వ్యాఖ్యానించడం తప్ప! ఇప్పుడు తెలంగాణ పర్యటనలో కూడా అవే సీన్లు రిపీట్ అవుతాయా అనేదే ప్రశ్న..?