అరుంధతితో తనలోని నటిని తొలిసారి పూర్తిగా బయటకు తీసుకొచ్చింది అనుష్క. రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి.. ఇలా ప్రతీ సినిమాకీ ఎదుగుతూ వస్తోంది. ఇప్పుడు భాగమతిగా ముస్తాబైంది. అనుష్క ఇప్పటి వరకూ చేయని కొత్త జోనర్ ఇది. ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. భాగమతిగా అనుష్క విశ్వరూపం చూపించిందన్నది ఈ సినిమాకి పని చేసినవాళ్ల మాట. అయితే… నాని కూడా ఇప్పుడు అదే మాట అంటున్నాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు నాని చూశాడట. మరీ ముఖ్యంగా విశ్రాంతి ముందొచ్చే సీన్ చాలా షాకింగ్‌గా అనిపించిందట. ఈ సినిమాతో అనుష్కకి అన్ని అవార్డులూ ఖాయమని జోస్యం చెబుతున్నాడు నాని. భాగమతి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నాని ఓ అతిథిగా హాజరయ్యాడు. అలవాటు ప్రకారం అనుష్కని తెగ పొగిడేశాడు. అనుష్క నా కుటుంబ సభ్యురాలు… అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అసలు ఈ కథ.. ప్రభాస్ వల్లే ఈ స్థాయికి వచ్చిందని, ప్రభాస్ తనకు దేవుడని… దర్శకుడు అశోక్ చెబుతున్నాడు. అయితే ప్రభాస్ ఈ కార్యక్రమానికి రాకపోవడం కాస్త లోటుగా కనిపించింది. కానీ ప్రభాస్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా.. అభిమానులు కేరింతలు కొట్టారు.