part-1: https://www.telugu360.com/te/the-story-behind-katti-mahesh-and-mahaa-news/
part-2: https://www.telugu360.com/te/how-katti-mahesh-reconciliation-with-pawan-kalyan-issue/
కత్తి మహేష్ వివాదానికి తెర పడ్డాక, కొన్ని ఛానెళ్ళు ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉంది. నిజానికి ఈ సమస్యకి బ్రేకింగ్ పాయింట్ వచ్చింది – మహా న్యూస్ లో, అదీ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి చొరవతో. ఎప్పుడైతే కత్తి సయోధ్య చేసుకున్నాడనీ, కేసులు వాపస్ తీసుకున్నాడని తెలీగనే ఈ ఇష్యూ లో అప్పటివరకు ఇష్యూ ని పరిష్కరించడం కంటే, “బ్రేకింగ్ న్యూస్” కోసమే ఎక్కువగా తపించినట్టు కనబడ్డ కొన్ని ఛానెల్స్ కూడా, తమ ఛానెల్ లోనే సమస్య సద్దుమణిగిందని చెప్పడానికి తెగ తాపత్రయపడ్డాయి.
“కత్తి లాంటి పరిష్కారం” తమ ఛానెల్ లో లభించిందని ఎబిఎన్ ఘనంగా ప్రకటించేసుకుంది. ఇక ఇది కూడా ఆల్రెడీ పూర్తయిన తర్వాత, మళ్ళీ ఇదే డిబేట్ టివి9 అనుబంధ ఛానెల్ అయిన టివి1 లో మొదలైంది. ఆ ఛానెల్ లో డిబేట్ జరుగుతున్న సమయం లో “నాలుగు నెలలుగా సాగుతున్న సమస్య కి టివి 1 లో దొరుకుతున్న పరిష్కారం” అని టివి9 లో స్క్రోల్ వేసుకున్నారు. మొత్తానికి అన్ని ఛానెళ్ళూ తమవద్దే ఈ సమస్య పరిష్కరించబడిందని ప్రొజెక్ట్ చేసుకోవడానికి తాపత్రయపడ్డాయి.
ఈ పందేరం సంగతి అలా ఉంచితే, టివి1, టివి9 లో జరిగిన చర్చలు మాత్రం ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కరింపబడటం టివి1, టివి9 లకి ఇష్టం లేదా అనే డౌట్ కలిగేలా ప్రవర్తించాయి. టివి 1 లో యాంకర్, “ఎవరో కోన్ కిస్కా మహేందర్ రెడ్డి (జన సేన ఉపాధ్యక్షుడు) చెప్పాడని మీరెలా రాజీ పడతారు?” అని ప్రశ్నిస్తే, టివి 9 లో రజనీకాంత్ “మీరిలా రాజీ పడిపోతే, ఇంతకాలం మిమ్మల్ని సపోర్ట్ చేసిన జనాలని మీరు వెర్రిపప్పలు (ఈ పద ప్రయోగం మాది కాదు, టివి9 రజనీకాంత్ దే) చేసినట్టు కాదా?” అని ప్రశ్నించారు. చూసిన జనాలకి “ఇంత త్వరగా ఈ సమస్య ముగించబడటం ఛానెళ్ళకి ఇష్టం లేదేమో” అన్న అభిప్రాయం కలిగితే అది జనాల తప్పు కాదు.
చివరగా – గత కొన్ని నెలలలో, కొన్నేళ్ళలో, వారాల తరబడి, రోజుకి గంటల తరబడి లీడింగ్ ఛానెళ్ళ ప్రైం టైం ని ఆక్రమించిన టాపిక్ లు – బ్యూటీషియన్ శిరీష ఆత్మ హత్య కానీ, టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్ కేసు కానీ, కత్తి మహేష్ ఇష్యూ కానీ, ఇవేవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాన్నీ ఇరుకునపెట్టేవి కావని జనాలకి అర్థం అవుతోంది. నిజంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగల, నిలదీయగల సంఘటనలు సమస్యల మీద – ఉదాహరణకి పుష్కరాల్లో జనాలు చనిపోయిన ఘటన, కాల్ మనీ సంఘటన, తెలంగాణా లో డబుల్ బెడ్రూం హామీ, దళితులకి భూమి హామీ -లాంటి వాటిమీద కేవలం నామమాత్రపు సమయం వెచ్చించటం కూడా ప్రజలకి అర్థమవుతూనే ఉంది.
మొత్తానికి తెలుగు “ఫోర్త్ ఎస్టేట్” ప్రస్తుతం టీఆర్పీ వేటలో, ప్రైం టైం ఆటలో జోగుతూ ఉన్నట్టు ప్రజలకి అనిపిస్తే అది ప్రజల తప్పు కాదు !!!
-ZURAN