హైదరాబాద్: బాలీవుడ్లో రాజ్ కపూర్ కుటుంబానికి ఎంత కీర్తి ప్రతిష్ఠలున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజ్ కపూర్ మనవరాలు, రణధీర్ కపూర్ కుమార్తె కరిష్మా కపూర్ కాపురం కారణంగా వారి పరువు రోడ్డున పడింది. కరిష్మా కపూర్‌పై ఆమె భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ సంచలన ఆరోపణలు చేశాడు. కరిష్మా పెళ్ళికి ముందే అభిషేక్ బచ్చన్‌తో సంబంధముందని, అతనితో విడిపోయాకే తనను వివాహం చేసుకుందని ఆరోపించాడు. భార్యగా, కోడలిగా, తల్లిగా విఫలమైందని, ఇంటిని కూడా గ్లామర్ ప్రపంచంగా మార్చాలని చూసిందని, అందుకే విడాకులు కోరుతున్నానని చెప్పాడు. డబ్బులకోసమే తనను పెళ్ళి చేసుకుందని ఆరోపిస్తూ బాంద్రా కోర్టులో విడాకులకోసం పిటిషన్ దాఖలు చేశాడు.
మరోవైపు, సంజయ్ కపూర్ ఆరోపణలను కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఖండించారు. సంజయ థర్డ్ క్లాస్ మనిషని అన్నారు. సంజయ్ కపూర్ ఎలాంటివాడో ఢిల్లీలో అందరికీ తెలుసని, భార్యను పట్టించుకోకుండా పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. సంజయ్ కపూర్, కరిష్మా కపూర్‌కు గతంలో ఒకసారి విభేదాలు వచ్చినా రాజీపడి ఒక్కటయ్యారు. అయితే ఈ సారి విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి.