సుకుమార్ సినిమాలన్నీ వెరైటీగానే ఉంటాయి. లాజిక్కుల మ్యాజిక్కులు కనిపిస్తాయి. సైన్స్, లెక్కలు… ఎక్కువ. అయితే… వీటితో పాటు గమ్మత్తైన క్యారెక్టరైజేషన్, దాంతో పాటు వినోదం రంగరిస్తారు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం ఆయన ‘రంగస్థలం’ సినిమాతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్నారు. దీన్నోనూ సుకుమార్ శైలి మ్యాజిక్ కనిపించబోతోందని టాక్. కాకపోతే.. ఈసారి సెంటిమెంట్ డోస్‌ని కాస్త పెంచినట్టు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమాలో ‘నాన్న’ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నాడు సుక్కు. ఈసారి ‘అన్న’ సెంటిమెంట్ ని దట్టింగా రంగరించినట్టు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ అన్నయ్యగా ఆది నటించాడు. తన పాత్ర ఈ కథలో చాలా కీలకమట. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని సుకుమార్ వేరే స్థాయిలో తెరకెక్కించాడని తెలుస్తోంది. ఆది ఈ సినిమాలో చనిపోతాడని, అప్పటి నుంచే ఈ కథ మలుపు తిరుగుతుందని, ఆ సందర్భంలో సెంటిమెంట్ డోసు బాగా పెంచేశాడని తెలుస్తోంది. ‘రంగస్థలం’ కాకుండా ‘అన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పెడితే ఇంకా పక్కాగా సూటైపోదునేమో. అన్నట్టు ఈనెల 24 న రంగస్థలం టీజర్ విడుదల అవుతోంది. అందులో… సెంటిమెంట్‌కి సంబంధించి సుక్కు ఏమైనా హింట్ ఇస్తాడేమో చూడాలి.