సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సిజె) దీపక్ మిశ్రా నాయకత్వంలో ఏర్పడిన త్రిసభ్య ధర్మాసనం జస్టిస్లోయా మృతి కేసులో ప్రజా ప్రయోజన వాజ్యాల విచారణ చేపట్టింది. మహారాష్ట్రతో సహా వివిధ హైకోర్టులలో ఇందుకు సంబంధించి ఎలాటి కేసులు వున్నా తమకే బదలాయించాలని ఆదేశాలిచ్చింది. ఈ విచారణ సందర్భంగా న్యాయవాదులు శ్రీమతి ఇందిరా జైసింగ్, దుష్యంత్ దావే చేసిన వ్యాఖ్యలపై సిజె తీవ్రంగా స్పందించారు. మీరు భవిష్యత్తులో ఇచ్చే ఉత్తర్వు మీడియా నోరు నొక్కడానికి దారి తీయొచ్చని జైసింగ్ అన్నప్పుడు దీపక్ మిశ్రా ఆగ్రహం వెలిబుచ్చారు. అలాగే దావే అమిత్ షా పేరును ప్రస్తావించినప్పుడు మీరు ఆయన పేరు తీసుకురావద్దు. కేసులో ఆయన కక్షిదారు కాదు. ఇప్పటికైతే లోయాది సహజ మరణంగానే భావించాలి అని అన్నారు.ఈ మేరకు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అభ్యంతరాన్ని ఆమోదించారు. అయితే హరీశ్ సాల్వే మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవడాన్ని కూడా జైసింగ్, దువేలు తప్పు పట్టారు. 2014 నవంబరులో మరణించిన లోయా మృతి కేసు విచారణ విషయంలోనే చలమేశ్వర్ తదితరులు నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే.