ఆర్కేగా సుపరిచితుడైన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తను అనుకున్నది సూటిగా వ్యక్తం చేసే కొద్దిమంది జర్నలిస్టుల్లో ఆయన ఒకరు. కొత్తను ప్రతిభను ప్రోత్సహిస్తారు కూడా. ఇప్పుడు తనపై విమర్శలు చేసే చాలాపత్రికల ఎడిటర్లు తమ సంస్థలో తయారైన వారేనని సంతోషంగా చెబుతుంటారు. శక్తిని మించి కూడా ప్రయోగాలూ ప్రతిఘటనలకు దిగుతారు. అవన్నీ అలా వుంచితే ఆయన కాలమ్ కొత్తపలుకు స్వభావంలో మార్పువస్తున్నట్టు కనిపిస్తుంది. రాజకీయావసరాల కొద్ది తెలుగుదేశం బిజెపి అధినేతలు దానిపై ఒక అధికారిక ముద్ర వేస్తున్నారు. దాని ప్రభావం రాతల్లోనూ కనిపిస్తే ఆశ్చర్యం లేదు. కెసిఆర్నో జగన్నో విమర్శించినంత నిశితంగా తీవ్రంగా ఆయన చంద్రబాబు గురించి రాయకపోవడం అందరికీ తెలుసు. రాసినప్పుడు కూడా చంద్రబాబు మరింత గట్టిగా వుండటం లేదనే విమర్శ ఎక్కువ. అందుకే అది ఆయనకూ నచ్చుతుంది. ఈ మధ్యలోనైతే చంద్రబాబుకు ఎక్కువగానే సానుకూల ప్రశంసలు అందుతున్నాయి. తనను అదేపనిగా విమర్శించిన అభిశంసించిన కెసిఆర్‌ను కూడా మెచ్చుకున్నా అది వ్యూహాలపరంగా జరుగుతుంటుంది. ప్రత్యేక హౌదా, కాల్‌మనీ కేసు తర్వాత చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటివారి నుంచి కొత్తపలుకు గురించిన ప్రశంసలు పెరిగాయి.చాలామంది దృష్టిలో నిర్మొహమాటంగా వుంటారని పేరు తెచ్చుకున్న ఆర్కే కాలమ్ అధికార పక్షం ఆమోద ముద్ర పొందడమే గాక మార్గనిర్దేశకంగా చెప్పబడటం నిస్పాక్షికతను పోగొట్టే ప్రమాదంవుంది. అలాగే నేతల పొగడ్దల నేపథ్యంలో కాలమ్‌లో మరీ సూక్ష్మ వివరాల్లోకి సాధారణ రాజకీయ పాలనా విషయాల్లోకి దిగబడిపోయి పదునూ నిర్ధిష్టత దెబ్బతినకుండా చూసుకోవలసి వుంటుంది. కొత్త పలుకు కొత్త పదును పెంచుకోవాలి గాని కోయిల పాటలా చిలకమాటలా కొత్త మలుపు తిరగ్గూడదని పాఠకులు కోరుకుంటారు. ఆయన అసలే నచ్చని వారు సరే సరి. ఇదంతా ఇష్టపడి చదివే వారి కోర్కె.