కొండగట్టు అంజన్న పూజల తర్వాత జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మీడియా గోష్టి తన సహజ శైలిలోనే వుంది తప్ప కొత్తదనం లేదు.తెలంగాణ గురించి కొంత జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. వాటికంటే కూడా ఆసక్తికరమైందేమంటే తనకు సినిమాల మీద ఆసక్తి అయిపోయిందని చెప్పడం. ఈ మాటలను ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. సినిమాల మధ్యలో సీజనల్ నాయకుడుగా వస్తున్నాడన్న విమర్శలకు సమాధానం కావచ్చు. లేక ప్రజలకు నమ్మకం కలిగించాలనుకోవచ్చు. రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలు వదులుకోవద్దని చిరంజీవి గతంలో ఆయనకు సలహా ఇచ్చారు. బహుశా తన అనుభవం అందుకు కారణం కావచ్చు. ఖైదీ150తో మెగా ప్లేస్ పునరుద్ధరించుకోవడానికి పడిన శ్రమ కారణం కావచ్చు. అయితే ఎందుకైనా సరే ఈ మాటలతో ఆయన అన్న చిరంజీవి సలహాను పాటించదల్చుకోలేదని చెప్పదలచుకున్నారు. విజయనగరం సమావేశం తర్వాత చిరు స్థానం గురించి తానే సృష్టించిన సందేహాలకు కూడా ఆయన సమాధానమిచ్చేశారు. ఇది తన స్వంతమనీ ఇందులో చిరుకే గాక కుటుంబ సభ్యులెవరికీ స్థానముండదని తేల్చిచెప్పారు. ఎపి తెలంగాణలలో కూడా బలాన్ని బట్టి పోటీ చేస్తాననడం ద్వారా తనకు తనే పరిమితులు విధించుకున్నారు.