పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోడం, వారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం అర్రులు చాచడం అనేది నేటి రాజకీయాల్లో ఒక అవసరం లేని అనివార్యతగా మారిపోయింది. ప్రజలకోసం పనిచేయాలి అనేదానికన్నా.. అధిష్టానం ఆశీస్సులు పొందాలనే ఆతృత కొంతమంది నాయకుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల కోసం త్యాగాలు కంటే, అధినాయకుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించుకునేందుకు కొందరు చాలా ఉత్సాహపడుతున్నారు! ప్రస్తుతం ఏపీ టీడీపీలో ఈ పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తారని అప్పట్లో ప్రకటించగానే.. కొందరు రాజీమానాలకు సిద్ధమైపోయిన సంగతి తెలిసిందే. బాబు కోసం తమ స్థానాలు ఉదారంగా ఇచ్చేసేందుకు నేతలు పోటీపడ్డారు! అయితే, ఇన్నాళ్ల తరువాత అదే చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చింది!
ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందనీ, ప్రజాక్షేత్రంలోకి దిగే అవకాశాలున్నాయంటూ అధికార పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే అంశం టీడీపీ వర్క్ షాప్ లో నేతల మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు త్యాగానికి సిద్ధమైపోయారు! ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజక వర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారట! విశాఖ త్వరగా అభివృద్ధి చెందుతోందనీ, నారా లోకేష్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని అన్నారట! మరో మంత్రి అమరనాథ్ రెడ్డి కూడా త్యాగానికి సిద్ధమైపోయారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గం నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారట. ఎందుకంటే, గతంలో కుప్పంలో ఉండే కొన్ని నియోజక వర్గాలు 2009 పునర్విభజనలో పలమనేరుకు వచ్చాయని చెప్పారు! అంటే, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని మండలాలు ఇప్పుడు పలమనేరు పరిధిలోకి వచ్చాయి కాబట్టి, లోకేష్ ఇక్కడి నుంచి పోటీకి దిగితే బాగుంటుందనేది ఆయన లాజిక్..! ఇలా త్యాగాలకు పోటీ పడుతున్న నాయకులిద్దరూ టీడీపీకి వలస వచ్చిన నేతలనే కావడం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం.
ఈ చర్చపై మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిజానికి ఇప్పుడీ చర్చ అత్యవసరం కూడా కాదు. కానీ, ఈలోగా త్యాగాలకు ఈ ఇద్దరు మంత్రులూ సిద్ధమైపోతున్నారు. నిజానికి, లోకేష్ ను వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి పోటీకి దించుతారనే ప్రచారం గతంలో వినిపించింది. ఆ జిల్లా నుంచి అయితేనే గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉందంటూ గతంలో కథనాలు వచ్చాయి. ఆ తరువాత దీనిపై చర్చే లేదు. ఇప్పుడు త్యాగాలకు సిద్ధమంటూ ఈ మంత్రులు ప్రకటనలు చేసేస్తున్నారు. నిజానికి, వీరు చేసేది త్యాగం ఎలా అవుతుందో మరి! ఎందుకంటే, లోకేష్ కోసం తమ నియోజక వర్గం ఇచ్చి, మరో నియోజక వర్గం నుంచీ పోటీకి చేస్తారు కదా! ఇది సర్దుబాటు మాత్రమే. కానీ, త్యాగాలని వారు చెప్తుండటం విశేషం. ఏదేమైనా, లోకేష్ విషయంలో కొంతమంది నేతలు చాలా ‘ముందుచూపు’తో వ్యవహరిస్తూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం!