సినిమా హిట్టవ్వడానికి కాస్టింగ్ ఎంత ఇంపార్టెంటో… రాజకీయాల్లో హిట్ కొట్టడానికి క్యాస్ట్ ఈక్వీషన్స్ (కుల సమీకరణాలు) అంతే ఇంపార్టెంట్. సినిమాలోని సన్నివేశంలో హీరో ఎంత చేసినా సైడ్ క్యారెక్టర్ సరిగా చేయకుంటే అందులో ఫీల్ పండదు. రాజకీయ చదరంగంలోనూ అన్ని కులాల వారు నాయకుడి తోడు రాకుంటే విజయం సాధించడం కుదరదు. ఈ విషయం కథానాయకుడు కమ్ రాజకీయ నాయకుడు (ఫుల్ టీమ్, టైమ్ రావాలి) పవన్ కళ్యాణ్ కు బాగా అర్థమైనట్టుంది. రెండు రోజుల్లో అటు క్రిస్టియన్లను, ఇటు హిందువులను కవర్ చేసేసి తెలివిగా వ్యవహరించారు.
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రతి పండగను తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తారు. క్రిస్మస్ సమయంలో చర్చికి, రంజాన్ సమయాల్లో ముస్లింల విందులకు వెళ్లి, వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. మొన్నటికి మొన్న సంక్రాంతికి రాజకీయ నాయకులంతా ఎంత సందడి చేశారో మనమంతా చూశాం. కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్. ఆయనో ‘అజ్ఞాతవాసి’. ఎప్పుడు ప్రజల్లోకి వస్తారో? ఎప్పుడు ఇంటి (లేదా ఫామ్ హౌస్)కి పరిమితం అవుతారో? సామాన్యులు చెప్పలేని పరిస్థితి. అలాంటి పవన్ మొన్న భార్యతో కలసి చర్చికి వెళ్లి ప్రార్థన చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. పవన్ మూడో భార్య అన్నా లెజినోవా క్రిస్టియన్ అనే సంగతి అందరికీ తెలుసు. ఆమెతో కలసి చర్చికి వెళ్లడంలో తప్పు లేదు. కానీ, హిందూ అయిన పవన్ సంక్రాంతి సమయంలో ఎక్కడా కనపడలేదు. హీరోగా నటించిన సినిమా విడుదలై ప్లాప్ అయినప్పుడూ బయటకు రాలేదు.
పవన్ జస్ట్ హీరో మాత్రమే అయితే ఎవరూ ఈ విషయాలు పట్టించుకోరు. పొలిటికల్ ఫీల్డులోకి వస్తున్నప్పుడు అందరూ అన్నీ గమనిస్తారు. ఏంటి? పవన్ చర్చిలకు మాత్రమే వెళ్తున్నారు? అనే సందేహాలొస్తే కష్టం (ఎన్ని పూజలు, హోమాలు చేసినా!). అందువల్లే అనుకుంట… చర్చికి వెళ్లిన మరుసటి రోజే కొండగుట్ట అంజన్న గుడికి వెళ్లారు. తనపై ఎలాంటి ముద్ర పడకుండా చూసుకున్నారు. రెండు రోజుల్లో క్రిస్టియన్లు… హిందువులను… కవర్ చేసేశారు. కులమతాలకు అతీతమైన రాజకీయాలంటూ మాటలు చెప్పే పవన్ రాజకీయ అడుగులు ఫక్తు పొలిటికల్ లీడర్లను తలపించడం విశేషమే మరి! ఈ రోజు ఆయన ఎవర్ని కలుస్తారో? మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో? తెలీదు. పనిలో పనిగా ముస్లింలను, ఇతరులను కలిస్తే మంచిదేమో!