మొదట్నుంచీ ఇదే సమస్య..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పే మాటలకీ… జనసేన పార్టీ నడుస్తున్న తీరుకీ మధ్య పొంతన కనిపించడం లేదు. ఇప్పుడేమంటున్నారూ… వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు! ఏ ప్రాతిపదిక పోటీకి దిగుతారంటున్నారూ… ఎన్నికలకు రెండు నెలల ముందు ఆలోచించుకుని, అప్పటికి తమకు ఎక్కడ ఎంత బలం ఉందో చూసుకుని పోటీ చేస్తామంటున్నారు. ఆ బలం ఎలా వస్తుందీ… దాని కోసమే కదా ఈ పర్యటనలు అంటున్నారు. ఆంధ్రాలో కొన్ని సమస్యలు తెలుసుకున్నామనీ, ఇప్పుడు తెలంగాణలో కొంత అవగాహన పెంచుకుంటామని పవన్ అంటున్నారు. అయితే, ఆంధ్రాలోగానీ, ఇప్పుడు తెలంగాణలోగానీ జనసేన బలాన్ని పెంచుకునే దిశగా పవన్ పర్యటనలు సాగుతున్నాయా అంటే.. లేదనే అనిపిస్తోంది.
ఒక రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే, మరీ ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి వెళ్లాలంటే… ముందుగా ఆ పార్టీ జనంలోకి చొచ్చుకెళ్లాలి. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాలి, పోరాటాలు సాగించాలి. ఇవన్నీ చేశాక.. బలమేంటనేది తెలుస్తుంది. దాని ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీకి దిగేందుకు కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్నదేంటీ.. కొన్ని సమస్యలను ప్రస్థావిస్తున్నారు, మాట్లాడుతున్నారు, తన అభిప్రాయం చెబుతున్నారు, అంతే! ఎన్నికలకు మహా అయితే మరో ఏడాదిన్నర సమయం ఉంది. ఈలోగా జనసేన బలం పెంచుకునేందుకు కావాల్సిన వ్యూహాత్మకత పవన్ దగ్గర ప్రస్తుతమైతే కనిపించడం లేదు. సమస్యలపై అవగాహన పెంచుకోవడం ఒక్కటే ఎన్నికల వ్యూహం కాలేదు కదా.
పవన్ ఆంధ్రా పర్యటనే తీసుకుంటే… ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, కాపు రిజర్వేషన్లు, పోలవరం వంటి కొన్ని సమస్యలపై మాట్లాడారు. కానీ, ఎంతవరకూ… తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టే స్థాయి దాటే వరకూ వెళ్లలేదు. చంద్రబాబు బాగానే చేస్తున్నారంటూ వెనకేసుకొచ్చినట్టు పవన్ తీరు అక్కడ ఉంటుంది. వైకాపా ప్రధాన ఆరోపణ కూడా ఇదే అనుకోండి. అధికార పార్టీ బాగా చేస్తోందని పవనే ఒప్పుకుని చెప్పుకుంటూ ఉంటే… జనసేనకు కొత్తగా మద్దతుగానీ బలంగానీ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ పర్యటన విషయంలోనూ ఇంతే. మొదటి రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మోసేశారు! ఆయన స్మార్ట్ సీఎం అని పవన్ పొగడ్తలు కురిపించారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తోందని చెబుతుంటే.. ఎక్కడైనా సరే, కొత్తగా జనసేనకు రోల్ అంటూ ఏముంటుంది..? అలాగని అధికార పార్టీలను విమర్శించమని, దుమ్మెత్తి పోయమని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ, సొంతంగా బలం పెంచుకోవాలంటే… సమస్యలపై మాత్రమే జనసేనాని ఫోకస్ ఉండాలి. అధికారంలో ఉన్నపార్టీ కావొచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావొచ్చు.. వాటి పనితీరును విశ్లేషించాల్సిన పని జనసేనకు ఉండకూడదు కదా! ఆంధ్రా, తెలంగాణల్లో అధికార పార్టీల పాలన అద్భుతః అయితే.. జనసేనకు ఎక్కడి నుంచీ ప్రత్యేక స్థానం వస్తుందనేదే ప్రశ్న..?
ఇప్పటికిప్పుడు తాను పోటీ చేసేసి, ఓట్లు అడిగే పరిస్థితి లేదనీ పార్టీ ఎదగడానికి కొంత సమయం పడుతుందనీ పవన్ చెబుతున్నారు. ఇదే సమయంలో సమస్యలపై రచ్చ చేయడం ఇష్టం లేదనీ అంటారు. అంటే, ఒక సమస్యపై ప్రజల తరఫున చేసే పోరాటానికీ… రాజకీయ రాద్దాంతానికీ ఉన్న చిన్న తేడాను పవన్ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నారు. ఇంకా కొంత డోలయామానం కనిపిస్తోంది. ఏదేమైనా పార్టీ ఎదిగేందుకు కావాల్సిన పునాదులు బలంగా వేసుకోవాలి కదా. ఆ పునాదులు ఎక్కడి నుంచీ వస్తాయి..? అధికార పార్టీలను వెనకేసుకుంటూ వస్తే.. సొంతంగా జనసేనకు ఉనికి ఎలా ఏర్పడుతుంది..? జనసేన అస్థిత్వం ఇదీ అని చెప్పుకునే పరిస్థితి వాస్తవ రూపంలో ఎక్కడ కనిపిస్తుంది..? వీటిపై జనసేనకు మరింత స్పష్టత అవసరం. ప్రస్తుతం పవన్ చేస్తున్న పర్యటన జనసేనకు ప్రచారంగా మాత్రమే కనిపిస్తోంది. పార్టీకి బలం చేకూర్చే వ్యూహంగా ఈ పర్యటనలు రూపాంతరం చెందాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.