ఆల్ ఈజ్ వెల్ అనుకున్నంత వరకూ అంతా బాగానే ఉంటుంది. తప్పులు కూడా ఒప్పులైపోతాయి. ఒక్కసారి బొక్క బోర్లా పడితే తప్ప…. తత్వం అర్థం కాదు. అప్పుడు ఒప్పులు కూడా తప్పులుగా కనిపిస్తుంటాయి. నిన్నటి వరకూ త్రివిక్రమ్‌ని ఆహా.. ఓహో అన్నవాళ్లే… ఇప్పుడు అజ్ఞాతవాసి చూసి అయ్యో అంటున్నారు. కొన్ని సీన్లు చూస్తుంటే త్రివిక్రమ్ దిగజారుడుతనం కనిపిస్తోందని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. త్రివిక్రమ్‌ని తపస్వి అని నెత్తిన పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు కాపీ క్యాట్ అంటూ ముద్ర వేస్తున్నారు. గత హిట్లవైపు కూడా అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ పనితీరు, అందులోని లోటు పాట్ల గురించి మెల్లమెల్లగా ఒక్కో విషయం బయటకు వస్తోంది.
త్రివిక్రమ్ ఓ రచయిత. స్క్రిప్టు విషయంలో చాలా పక్కగా ఉంటాడని చెప్పుకుంటారు. అతని డైలాగులు చూస్తే.. ప్రతీ మాట కోసం తనెంతగా తపన పడతాడో అర్థం అవుతుంది. కాకపోతే… గత రెండు మూడు సినిమాల నుంచీ.. సెట్లో కేర్ వ్యాన్‌లో కూర్చుని సీన్లు వండడం మొదలెట్టాడని చెప్పుకుంటున్నారు. ఆ రోజు సీన్ ఏంటో, డైలాగులు ఏంటో.. త్రివిక్రమ్ నుంచి డైలాగ్ పేపర్ అందేవరకూ ఎవ్వరికీ తెలీదట. సెట్లో కెమెరామెన్, ఆర్టిస్టులూ త్రివిక్రమ్ కోసం ఎదురుచూస్తుంటే, ఆయన మాత్రం కేర్ వాన్లో రిలాక్స్ అవుతూ.. సీన్ గురించి ఆలోచిస్తాడని టాక్ వినిపిస్తోంది.
సెట్లో త్రివిక్రమ్ ఎవ్వరి సలహాలూ తీసుకోరని మరో మాట బలంగా వినిపిస్తోంది. సహాయ దర్శకులు ఎవరైనా ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తే.. మరుసటి రోజు నుంచి సదరు సహాయకుడు సెట్లో కూడా కనిపించడట.
ఈమధ్య త్రివిక్రమ్ మేకింగ్ మీదే శ్రద్ద పెట్టాడని, సెట్లో తనకు కావల్సినవి, కావల్సినట్టు లేకపోతే.. పేకప్ చెప్పి వెళ్లిపోతాడని సన్నిహితి వర్గాలు చెప్పాయి.
తనకంటూ ఓ బలమైన టీమ్ ఉంది. సిరివెన్నెల దేవిశ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి… ఇలా ఓ టీమ్ ని ఏర్పరచుకున్నాడు. మెల్లమెల్లగా వాళ్లలో ఒకొక్కరూ త్రివిక్రమ్‌కి దూరం అవుతున్నారు. అత్తారింటికి దారేది, అ.ఆలలో సిరివెన్నెలతో ఒక్క పాట కూడా రాయించలేదు త్రివిక్రమ్. అజ్ఞాతవాసిలో అయితే దేవిశ్రీని, రామజోగయ్యని పక్కన పెట్టేశాడు. ఇలా తన టీమ్ లో ఒకొక్కరినీ దూరం చేసుకోవడం కూడా ఓ విధంగా త్రివిక్రమ్‌ని బలహీన పరుస్తోంది.
అయితే ఇవన్నీ తాత్కాలికమే. త్రివిక్రమ్‌ని మళ్లీ పుంజుకునే శక్తి ఉంది. డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవడం కష్టం కావొచ్చు. కానీ ఇది జ్ఞానం. పోడానికి ఛాన్సే లేదు. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. తనలోని రచయితని మళ్లీ బయటకు తీసుకొచ్చే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. రచయిత రచయితలానే ఆలోచిస్తే త్రివిక్రమ్ నుంచి మరిన్ని అద్భుతాలు చూడొచ్చు.