మరికొద్ది గంటల్లో ‘భాగమతి విడుదల కానుంది. ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్రేషన్సే ఉన్నాయి. అనుష్క సినిమా కాబట్టి.. ఓసారి చూసి రావాల్సిందే అన్నట్టు డిసైడ్ అవుతున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ముమ్మాటికే అనుష్కనే. నిన్నా మొన్నటి వరకూ ‘భాగమతి’ అనగానే అనుష్క గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమాలో మరో సెంట్రాఫ్ అట్రాక్షన్ కూడా ఉంది. అదే.. `భాగమతి బంగ్లా` సెట్. సగం కథ ఈ సెట్లోనే జరుగుతుంది. 5వందల ఏళ్ల క్రితం నాటి లుక్ వచ్చేలా ఈ బంగ్లాని డిజైన్ చేశారు క్రియేటీవ్ ఆర్ట్ డైరెక్టర్.. రవీందర్. మగధీర, మర్యాద రామన్న, ఈగ, అత్తారింటికి దారేది… ఇలా తెలుగు నాట సూపర్ హిట్ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు రవీందర్. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో.. అన్నపూర్ణ స్టూడియోలో నెల రోజులు శ్రమించి ఈ సెట్‌ని తీర్చిదిద్దారు. సెట్లో అడుగుపెడితే.. నిజంగానే 5 వందల క్రితం నాటి బంగ్లా చూస్తున్నామా అనిపించేంతలా థ్రిల్ చేశారు రవీందర్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెట్‌ని నిర్మించడంతో.. అందరి దృష్టీ అటువైపు పడింది. మీడియాలోనే కాదు, ఇండ్రస్ట్రీ మొత్తం… ఈ సెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అత్యంత ఖరీదైన సెట్ గా భాగమతి బంగ్లాని అభివర్ణిస్తున్నారు. టెక్నికల్ టీమ్ లో మది లాంటి మేటి ఛాయాగ్రహకుడు ఉన్నా… తమన్ లాంటి పాపులర్ సంగీత దర్శకుడు ఉన్నా.. ఇప్పుడు రవీందర్ గురించే చెప్పుకుంటున్నారు. మరి ఈ సెట్‌ని సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.