బుధవారమంతా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. హైదరాబాద్‌లోని శివ అనే యువకుడు ఎంఎంటీఎస్ రైలు వస్తుండగా పట్టాల పక్కనే నిలబడి సెల్ఫీ వీడియో తీసుకోవాలని ప్రయత్నించగా… రైలు అతణ్ణి బలంగా ఢీ కొట్టడంతో గాయాల పాలవుతాడు. వీడియో చూస్తే… ఎవ్వరికీ అది ఫేక్ అనిపించదు. అంత ఒరిజినల్ (రియల్)గా ఉంది. ఎంత ఒరిజినల్ అన్పించిందంటే… తెలుగులో అత్యధిక పాఠకాదరణ ఉన్న ప్రముఖ దినపత్రిక ఈనాడు మెయిన్ పేజీలో, సాక్షి మూడో పేజీలో, ఆంధ్రజ్యోతి 17వ పేజీలో న్యూస్ వేసేంత! రెండో రోజుకు తెలిసింది ఏంటంటే… అందరూ చూసింది ఫేక్ వీడియోని. సదరు శివ శుభ్రంగా, చక్కగా ఉన్నాడు. గాయాలు గట్రా ఏవీ లేవు. ముందు రోజు వచ్చిన వీడియో సంగతి ఏంటి? టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యిందిగా… దాన్ని వాడుకున్నాడు. గ్రాఫిక్స్ లో ట్రైన్ గుద్దినట్టు వీడియో క్రియేట్ చేశాడు. న్యూస్ బాగా వైరల్ అయిన తర్వాత శివ ఫ్రెండ్స్ అతడు బాగున్న వీడియోను విడుదల చేశారు. లేటెస్ట్ వీడియో చూస్తే… జనాలను, మీడియాను శివ వెర్రోళ్లను చేశాడనిపిస్తుంది.
జనాలది ఏముంది? సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న వీడియోలో రియల్ ఏదో… ఫేక్ ఏదో… తెలుసుకునే తీరిక ఉండదు. కానీ, మీడియా స్పష్టంగా పూర్తి వివరాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలి. మీడియా తెలుసుకునే ప్రయత్నమే చేసింది. పోలీసులు తెలుపగా పత్రికల్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. “సెల్ఫీ వీడియో తీసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి పేరు శివ. అతడిది వరంగల్ జిల్లా. వయసు 25ఏళ్లు. ఇటీవలే హైదరాబాద్‌లోని బోరబండ పర్వత్‌నగర్‌లో నివాసం ఉంటున్న బావ దగ్గరకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం బోరబండ రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన జరిగింది. స్థానికులు చెప్పినా వినకుండా సెల్ఫీ వీడియో తీసుకోవాలని ప్రయత్నించాడు. భరత్‌నగర్ ఆర్పీఎఫ్ పోలీసులు శివపై కేసు ఫైల్ చేసి బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి రూ.500 జరిమానా విధించి, కౌన్సెలింగ్‌కు అటెండ్ కావాల్సిందిగా ఆదేశించారు”. పోలీసులు కేసు ఎప్పుడు ఫైల్ చేశారు తెలుసా? సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టిన తర్వాత.
శివ ఫ్రెండ్స్ విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత జనాల్లో ఆటోమేటిక్ గా కొన్ని డౌట్స్ వచ్చాయి. నెంబర్ వన్: రైలు అంత తీవ్రంగా ఢీ కొడితే… రెండు రోజుల్లో కోలుకోవడం సాధ్యమేనా? నెంబర్ టు: శివ ఫ్రెండ్స్ విడుదల చేసిన వీడియో పాతదా? కొత్తదా? నెంబర్ త్రీ: ఆదివారం ఘటన జరిగితే… సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో చక్కర్లు కొట్టే వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇటువంటి ఘటన ఒకటి జరిగిందని ఎందుకు తెలుసుకోలేకపోయారు? నెంబర్ ఫోర్: రైలు ఢీ కొట్టి వెళితే అందులోని డ్రైవర్ నెక్స్ట్ స్టేషనులో అయినా ఎందుకు సమాచారం ఇవ్వలేదు?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం… శివ హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో జిమ్ ట్రైనర్ ఉద్యోగం చేస్తున్నాడు. ట్రైన్ యాక్సిడెంటు కాలేదు. ఏం కాలేదు. మనిషి బాగానే ఉన్నాడు. అతడు క్రియేట్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఫ్రెండ్స్ లేటెస్ట్ వీడియో విడుదల చేశారు. ముందు వచ్చిన వీడియో చూసిన పోలీసులు నిజమే అనుకుని ఒక ఫేక్ కేసు క్రియేట్ చేసి, మీడియాకు తప్పుడు సమాచారం అందించారట! ఒకవేళ పోలీసులు చేప్పేది నిజమే అయితే… శివను మీడియా ముందు నిలబెట్టి ఏ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు? తలకు ఎక్కడ గాయమైంది? వంటి వివరాలు నిరూపిస్తే సరిపోతుంది.