ఎపి తెలంగాణ శాసనసభల సీట్ల సంఖ్య పెంపు ఖాయమని, ప్రధాని మోడీ ఉత్తర్వుపై సంతకం చేశారని వస్తున్న వార్తలు సోషల్ మీడియా కథనాలు నిజం కాదు. అయితే కేంద్రం ఆ దిశలోనే ఆలోచిస్తున్న మాట మాత్రం నిజమట. మనకు బలం చాలా తక్కువగా వున్నప్పుడు సీట్లు పెంచితే ప్రయోజనం ఏమిటని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్టే విధించిన మాట వాస్తవమైనా ఇటీవలి కాలంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పదేపదే అదే విజ్ఞప్తి చేయడంతో పునరాలోచన మొదలైందని బిజెపి సీనియర్ నాయకుడొకరు చెప్పారు. దీనికి తోడు ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో వున్న ఒక పెద్దాయన తనను మర్యాదగా కలిసిన వారందరితో ఈ సంగతి ముచ్చటిస్తున్నారట. అమిత్ షాకు దీనిపై మీరూ ఒక మాట చెప్పండి అని సూచిస్తున్నారట. అలా అందరూ వెళ్లి చెబుతుంటూ ఆయనా ఆలోచనలో పడవలసి వచ్చిందని సమాచారం.దీనికి తోడు కెసిఆర్ తనతో భేటీలో సీట్లపెంపు గురించి చెప్పడం మోడీ పట్టించుకుని అమిత్ షాను దానిపై దృష్టి పెట్టాల్సిందిగా కోరారట. అయితే తెలంగాణ బిజెపి నేతలు అమిత్ షాకు ఎట్టిపరిస్థితుల్లో సీట్లు పెంచవద్దని మరీ మరీ మనవి చేసినా స్వయానా ప్రధాని చెప్పడంతో పరిస్థితి మారిందట. ఏమైతేనేం ఇవన్నీ కలసి సీట్ల పెంపు ఆలోచన కార్యరూపం దాలుస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ అంశం తీసుకోవచ్చని అంటున్నారు.