ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం..! సామ దాన భేద దండోపాయాలు.. ఇలా ఏది అవసరమైతే దాన్ని ప్రయోగించి ఆ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం అనేదే భాజపా వ్యూహం! అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలు అంటుంటారు. ఇప్పటికే ఓ ప్రత్యేక బృందాన్ని పంపించి.. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా కొంత కసరత్తు ప్రారంభించారనే కథనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముందస్తు ఎన్నికలతోపాటు, వివిధ రాష్ట్రాల్లో భాజపా ప్రవేశానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఉందనీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా గతంలో కంటే ఎక్కువ స్థానాలు భాజపా గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ముందస్తు ఎన్నికల గురించి కూడా సూటిగా స్పందించలేదుగానీ… ఆ ఆలోచనలో భాజపా ఉందనే సంకేతాలు ఇవ్వడం గమనార్హం. నిజానికి, ఏప్రిల్ లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడ భాజపా గెలిస్తే.. కచ్చితంగా దేశంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం ఉంటుంది. సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే భాజపాకి కొంత మేలు జరుగుతుందనే వ్యూహంతో కమలనాథులున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే.. కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే. ఇక, తెలంగాణ విషయానికొస్తే… ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పట్టు సాధించడానికి కావాల్సిన అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అమిత్ షా వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ పరిస్థితులు భాజపాని ఆహ్వానిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇంతకీ… తెలంగాణపై అమిత్ షా ధీమా ఏంటో వారికే తెలియాలి. రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం ఇచ్చే రాజకీయ వాతావరణం లేకుండా చేయడంలో తెరాస ఎప్పటికప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉంటూనే వస్తోంది. ప్రతిపక్షాలు ఉన్నా… నాయకులను అధికార పార్టీలోకి ఆహ్వానించి వాటిని నిస్తేజం చేయడంలో కేసీఆర్ విజయం సాధించారనే చెప్పాలి. ఇక, మిగిలింది భాజపా. కేంద్రంలో భాజపాతో పొత్తు కోసం కేసీఆర్ ఆశపడుతున్న వైనం చూస్తున్నాం. అదే సమయంలో స్థానికంగా తమకున్న బలాన్ని భాజపా అర్థం చేసుకోవాలనీ… తెరాసతో పొత్తు కోసం భాజపా నుంచి ప్రయత్నం మొదలైతే, సానుకూలంగా స్పందించేందుకు తాము సిద్ధమనే వాతావరణాన్ని కేసీఆర్ తయారు చేస్తున్నారు. స్థానికంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే… భాజపాను ఆహ్వానిస్తున్న ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటో అమిత్ షా మరింత స్పష్టంగా చెబితే బాగుండేది. పోనీ, రాష్ట్ర స్థాయిలో భాజపా నాయకులు అత్యంత క్రియాశీలంగా ఉంటున్నారా..? కేసీఆర్ సర్కారుపై పోరాటాలు చేయగలుగుతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టగల వ్యూహం వీరి దగ్గర ఉందా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లేవు. మరి, తెలంగాణలో భాజపా ప్రవేశానికి, బలోపేతానికి అనుకూలమైన వాతావరణం ఎక్కడుంది..?