నిన్న జరిగిన ఛలో సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. నాగ శౌర్య సినిమా కి చిరంజీవి హాజరవడం నిజంగానే చాలా మంది కి ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరూ గతం లో ఎక్కడా కలిసినట్టు గానీ, కనీసం ఒక ఫోటో కలిసి దిగినట్టు గానీ ఎక్కడా లేదు. మరి ఇదెలా కుదిరిందో అన్న చిన్న డౌట్ ఉన్నవారి సందేహాన్ని చిరంజీవే స్వయంగా తీర్చాడు తన స్పీచ్ లో. చిరంజీవి మాట్లాడుతూ..
“మీకు అనిపించవచ్చు. నాగశౌర్య, చిరంజీవి కలిసి ఎక్కడా ఒక్క ఫొటో కూడా లేదు. వీళ్లకు ఎలా పరిచయం అని, నాగశౌర్య ఫంక్షన్‌కి చిరంజీవి రావడం ఏమిటని అనిపించవచ్చు. నాగశౌర్య నన్ను కలవాలని, ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తుంటే.. నేను అందుబాటులో లేక రెండు మూడు సార్లు రెస్పాండ్ కాలేకపోయాను. మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుండేసరికి ఎందుకో.. అని రమ్మని పిలిచాను. వారి అమ్మగారైన ఉషగారితో ఇంటికి వచ్చినపుడు తను ఒకటే కోరాడు. ఇలా ఫంక్షన్ చేసుకుంటున్నాం. అది మీ సమక్షంలో, మీ ప్రోత్సాహంతో జరుపుకోవాలనుకుంటున్నాం.. అని అడగగానే.. నేను ఎక్కువ సేపు కూడా ఆలోచించలేదు. నాగశౌర్యా వస్తాను అన్నాను. అలా అనడానికి కారణం, ఒక్కసారి గతంలోకి వెళ్లాను. నా కెరియర్ బిగినింగ్ టైమ్‌లో నా సినిమా 100 రోజుల ఫంక్షన్‌కి నేను అభిమానించే ఓ స్టార్‌ని పిలవాలని, ఆయన వస్తే బాగుంటుందని, ఆ ఉత్సాహం, ప్రోత్సాహం వేరని అడిగితే, ఆయన బిజీగా ఉండి రాలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దు అని ఆయన అనడం జరిగింది. చివరికి ఆయన లేకుండా ఏదో తూతూ మంత్రంగా ఫంక్షన్ ముగించేశాం. ఆరోజున చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది. ఆయన వచ్చి ఉంటే ఆ ప్రోత్సాహం, ఉత్సాహం వేరుగా ఉండేది. అది గుర్తుకు వచ్చినప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూశాను. నేను వెళితే, నాగశౌర్య పొందే ఉత్సాహం వేరు. అందుకే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం నాగశౌర్యకు ఇవ్వాలనే.. అది ఎంత స్పిరిట్‌ని ఇస్తుంది. ఒక ఆర్టిస్ట్‌ని ఎంత మోటివేట్ చేస్తుంది అనేది నాకు తెలుసు. నేను అనుభవించాను. అలాంటి ఫీలింగ్ నాగశౌర్యకి ఇవ్వాలనే వస్తాను అని చెప్పాను. చాలా సంతోషించాడు.”
అలాగే ఈ ఛలో సినిమా నాగశౌర్యకు తన కెరియర్లో బెస్ట్ చిత్రంగా నిలవాలని, పెద్ద స్థాయి చిత్రంగా నిలబడాలని ఆకాక్షించారు చిరంజీవి. ఫిబ్రవరి 2 న విడుదల కానుంది ఈ సినిమా.