గుత్తా సుఖేందర్ రెడ్డి… మంత్రి పదవి వస్తుందన్న ఆశతోనే కాంగ్రెస్ కి హ్యాండిచ్చి కారు ఎక్కేశారని ప్రచారం మొదట్నుంచీ ఉంది! అయితే, పదవి ఇంతవరకూ దక్కలేదు. కేసీఆర్ క్యాబినెట్ లో మార్పులకూ సరైన సందర్భమూ రాలేదు. రైతు సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించి, క్యాబినెట్ హోదా కల్పిస్తారన్న ఆశలు కూడా దాదాపు కొడిగట్టేశాయి. మరోపక్క… ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాదిలోనే ఉండొచ్చనే సంకేతాలు కేంద్రం ఇస్తోంది. దీంతో గుత్తా మంత్రి పదవి ఆశల్ని ఈ టెర్మ్ కి వదిలేసుకోవాల్సిందే అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇలా అసంతృప్తితో ఉన్న గుత్తాకు ఎలాగోలా సర్దుబాటు చేసి, మంత్రి పదవి ఇస్తే… నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను ఎదుర్కోవడం సులువౌతుందన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా తాజాగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ గుత్తా పదవిపై కొత్త ఆశలు వచ్చాయి! అయితే, ఇప్పుడు తెరాస ఈ అంశమై కొంతమంది నేతలు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది..!
అదేంటీ.. నల్గొండ జిల్లాలో తెరాసకు ఆయనే కీలకంగా మారబోతున్నారన్న సంకేతాలు అధినాయకత్వం నుంచి వెలువడుతుంటే, ఈ గుస్సా ఎందుకూ అనేగా ప్రశ్న..! కాస్త వివరంగా చెప్పాలంటే… ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓ అస్త్రం దొరికింది. అదేంటంటే, ఢిల్లీలో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈసీ సూచించిన సంగతి తెలిసిందే కదా. ఆ స్ఫూర్తితోనే కాంగ్రెస్ నేతలు తెరాసకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ నియమించిన పార్లమెంటు సెక్రటరీల నియామకాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పిన సంగతి కూడా తెలిసిందే కదా. ఆ సమయంలో కేసీఆర్ సర్కారు నిర్ణయంపై కోర్టుకు గుత్తా సుఖేందర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ ఉన్నారు కదా. అయితే, ఆ తరువాత మనసు మార్చుకోవడం.. కేసు ఉప సంహరణ అనేసరికి గుత్తా వ్యవహార శైలిపై కోర్టు అక్షింతలు వేసింది.
ఇప్పుడు తెరాస ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని కాంగ్రెస్ లేవనెత్తడం, రాష్ట్రపతికీ, ఈసీకీ, గవర్నర్ కీ ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెరాసకు గతంలో ఇబ్బంది కలగడానికి కారణమైన గుత్తాకి మంత్రి పదవి ఇవ్వడం ఏంటనేది కొందరి వాదనగా వినిపిస్తున్నారని సమాచారం! అంతేకాదు, తెరాస సర్కారుపై కేంద్ర సంస్థలకు గుత్తా ఫిర్యాదులు చేశారనీ, దాంతో రాష్ట్రానికి రుణాలు రాకుండా అడ్డుకున్నారన్న పాయింట్ ను కూడా కొంతమంది తెరాస నేతలు ఇప్పుడు తెరమీదికి తెస్తున్నారట. అలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటంటూ కొంతమంది మండిపడుతున్నట్టు సమాచారం. మరి, ఈ గుస్సా కేసీఆర్ వరకూ చేరిందో లేదో..!