ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ భాజపా నేతల విమర్శలపై స్పందించారు. ఫిరాయింపు నేతలను మంత్రి పదవుల నుంచి తొలగించాలంటూ ఇటీవలే భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. కొద్దిరోజుల కిందట పోలవరం అంశంలో కూడా ఏపీ భాజపా నేతల వైఖరి తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇలా ఈ మధ్య దాదాపు అన్ని సందర్భాల్లోనూ మిత్రపక్షమైన భాజపా వైఖరి టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటోంది. ఈ అంశాలపై సంయమనం పాటించాలనే టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధిస్తూ వస్తున్నారనీ, అందుకే భాజపా నేతల వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ప్రతిస్పందన రావడం లేదన్నది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇవే అంశాలపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడటం విశేషం!
‘వాళ్ల లీడర్ షిప్ ఆలోచించుకోవాలి. మిత్రపక్ష ధర్మం వల్ల నేను మాట్లాడను. మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నాను. అవసరమైతే ఇంకా చేస్తాను. ఎన్నిసార్లైనా అదుపులో పెట్టుకుంటాను. ఒకవేళ వద్దనుకుంటే నమస్కారం పెట్టేసి, ఆ తరువాత ఎన్నైనా మాట్లాడుకుందాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త ఘాటుగా స్పందించారు. భాజపా నేతలు తెలుగుదేశంపై ఈ మధ్య చేస్తున్న విమర్శల అంశాన్ని సీఎం ముందు విలేకరులు ప్రస్థావించగానే ఆయన ఇలా వ్యాఖ్యానించారు. తమ పార్టీ నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నానని చెబుతూనే… స్థానిక భాజపా నేతల్ని అదుపులో పెట్టాల్సిందిగా భాజపా అధిష్టానాన్ని చంద్రబాబు సూచించడం గమనార్హం.
చంద్రబాబు వ్యక్తం చేసిన ఆగ్రహం కేవలం రాష్ట్ర భాజపా నేతలపై అనేది మాత్రమే కనిపిస్తోంది. నిజానికి, కేంద్రం సాయంపై కొంత అసంతృప్తి ఉన్నా, కేటాయింపులపై నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న భాజపాపై కొంత ఆగ్రహం ఉన్నా… సంయమనంతో సాధించుకోవాలన్న వ్యూహంతోనే చంద్రబాబు మొదట్నుంచీ వ్యహరిస్తూ వస్తున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన భాజపాపై కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం మిత్రధర్మం అనే అంశం తీసుకొస్తుంటారు. అయితే, ఏపీ భాజపా నేతల ప్రయత్నం ఏంటంటే… కేంద్రం నుంచి ఎంత సాయం వస్తున్నా, తమకు ఆ ఘనత దక్కకుండా చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వారూ చేస్తున్నారు. అయితే, ఈ విమర్శలు కేంద్ర ప్రోద్బలంతో చేస్తున్నవా..? లేదంటే, తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదన్న అక్కసుతో రాష్ట్ర భాజపా నేతలు చేస్తున్నవా అనేది మాత్రం స్పష్టత లేని అంశంగానే ఉంటూ వస్తోంది.
ఇదే సందర్బంలో భాజపాతో జగన్ పొత్తు విషయమై కూడా చంద్రబాబు స్పందించడం విశేషం. ప్రత్యేక హోదా ఇస్తే భాజపాతో కలిసి పనిచేస్తామనేది జగన్ కొత్తగా చెబుతున్న మాట కాదని అన్నారు. హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ఎన్నోసార్లు చెప్పినా, ఆయన మాట మీద నిలబడలేదని విమర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మద్దతు ప్రకటించిన సమయంలో ప్రత్యేక హోదా ఆయనకు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు.
మొత్తానికి, ఏపీ భాజపా నేతలు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా కొంత అసహనానికి గురౌతున్నారని అర్థమౌతోంది. అయితే, ఈ వ్యాఖ్యలను భాజపా వైఖరిగా ఆయన చూడటం లేదు అనిపిస్తోంది. ఇది కేవలం ఏపీ భాజపా నేతల వైఖరే అన్నట్టుగా… దీనిపై కేంద్ర నాయకత్వం స్పందించాలన్నట్టుగా సూచనలు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి, చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.