జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీ (పి.డిపి.), బీజేపీల మధ్య గత రెండు వారాలుగా ఏర్పడిన ప్రతిష్టంభన త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో తమ పొత్తులు కొనసాగిస్తూ బీజేపీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆ పార్టీ నిర్ణయించుకొంది.
ఆ పార్టీ శాసనసభ్యుడు నయీం అక్తర్ నిన్న శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ “జమ్మూ కాశ్మీర్ రాజకీయాలలో మరియు భారత్-పాక్ సంబంధాల విషయాలలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఫ్తీ మహమ్మద్ సయీద్ సాబ్ నిర్దేశించిన మార్గంలోనే మేము నడవాలని నిశ్చయించుకొన్నాము. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై మా అధినేత మహబూబా ముఫ్తీ తుది నిర్ణయం తీసుకొంటారు. అందుకోసం మేము బీజేపీకి ఎటువంటి ముందస్తు షరతులు విధించబోవడం లేదు. కానీ రెండు పార్టీల మధ్య ముఫ్తీ సాబ్ హయాంలో జరిగిన ఒప్పందాలకు బీజేపీ యధాతధంగా కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా పాకిస్తాన్ తో స్నేహసంబంధాలు మెరుగుపరుచుకొని, తద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాము. ముఫ్తీ సాబ్ మరణశయ్య ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటించి, పాకిస్తాన్ తో స్నేహ సబంధాలు మెరుగుపరుచుకొనే ప్రయత్నం చేయడం, సయీద్ సాబ్ ఆశిస్తున్న విధానమే. దానిని మోడీ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకొంటున్నాము,” అని అన్నారు.
ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆకస్మిక మరణం తరువాత పిడిపికి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. పిడిపి కూడా అందుకు సానుకూలంగా వ్యవహరించడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం చెందింది. అయినా సమ్యమనమ పాటిస్తూ పిడిపి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తోంది. పిడిపి నుండి సానుకూలమయిన స్పందన వచ్చే వరకు ఇక ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకొంది. బహుశః నేడో రేపో మెహబూబా ముఫ్తీ స్వయంగా దీనిపై నిర్దిష్టమయిన ఒక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ఆమె స్పందన చూసిన తరువాతనే బీజేపీ ప్రతిస్పందించాలని భావిస్తోంది.