పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అనే అపవాదుని మూటగట్టుకుంది… అజ్ఞాతవాసి. పంజా, సర్దార్ లాంటి సినిమాలు ఫ్లాపులు అయినా ఈ స్థాయిలో పంపిణీదారుల్ని నష్టపరచలేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో బయ్యర్లు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఒక్కో చోట దాదాపు 70 శాతం నష్టాల్ని చవిచూడాల్సివచ్చింది. హారిక హాసిని సంస్థ ఎంతో కొంతమొత్తం తిరిగి ఇస్తుందన్నది బయ్యర్ల విశ్వాసం. ఈ విషయమై నిర్మాతలతో పంపిణీదారులు మాట్లాడారు కూడా. స్పష్టమైన హామీకోసం కొంతమంది పంపిణీదారులు పవన్ కల్యాణ్‌ని కూడా కలిసినట్టు సమాచారం. ”ఈ విషయంలో నేనేం చేయలేను. అన్నీ నిర్మాతలే చూసుకుంటారు. ప్రస్తుతం నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నా. అందుకే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేను..” అని పవన్ మొహమాటం లేకుండా చెప్పేశాడని తెలుస్తోంది. పవన్ తమని ఆదుకుంటాడని భరోసాతో వెళ్లిన వాళ్లంతా నీరసపడిపోయార్ట. సర్దార్ గబ్బర్ సింగ్ నష్టాల్ని కాటమరాయుడుతో భర్తీ చేసినట్టు… ‘అజ్ఞాతవాసి’ నష్టాల్ని పూడ్చడానికి పవన్ మరో సినిమా తీయాలేమో. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండి.. సినిమాల్ని పట్టించుకొనే పరిస్థితుల్లో లేడు. కాబట్టి హారిక హాసిని సంస్థే… కాస్త కనికరం చూపించాలి.