జనసేన పార్టీ దశ దిశ గురించి పవన్ కల్యాణ్ కంటే ఎక్కువగా ‘వారు’ ఆలోచించేస్తారు..! పవన్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ‘వారే’ మార్గదర్శకత్వం చేశారు. ఏది మాట్లాడాలీ ఎలా మాట్లాడాలనేది కూడా ‘వారే’ సూచనలు సలహాలూ ఇస్తుంటారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి.. పవన్ కల్యాణ్ కు రాజకీయాలే అనవసరమని, ప్రత్యామ్నాయంగా లోక్ సత్తా లాంటి వేదికలు పెట్టుకుంటే మంచిదని ఇవాళ్ల తీర్మానించేశారు. ఇంతకీ ‘వారు’ ఎవరంటే.. ఇంకెవరూ, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ గారు! ఈ వారం కొత్త పలుకులో మరోసారి పవన్ కల్యాణ్ గురించి పలికారు! అయితే, గతంలో ఆయన ఎప్పుడు పలికినా… జనసేన పార్టీ పొత్తు గురించి, ఆ పొత్తు టీడీపీతో మాత్రమే ఉండాలనీ, టీడీపీతో మాత్రమే సాధ్యమనీ కొన్ని పలుకుల్లో చెప్పుకుంటూ వచ్చారు. కనీసం ఆయా సందర్భాల్లో జనసేనను ఒక రాజకీయ పార్టీగా గుర్తించారు, సంతోషం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా ఒప్పుకున్నారు, మరీ సంతోషం. కానీ, ఇప్పుడు.. మొత్తం సీన్ మారిపోయింది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో జనసేన మనుగడే అసాధ్యమని తీర్మానించారు.
పవన్ కల్యాణ్ కు రాజకీయాలపై స్పష్టత లేదన్న విషయం తెలంగాణ పర్యటనతో స్పష్టమైంది నేటి కొత్త పలుకులో పేర్కొన్నారు. పాతికేళ్లపాటు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు ఇస్తున్నారనీ, పాతికేళ్ల తరువాత ఎవరేమౌతో ఎవరు చూసొచ్చారన్నారు. పాతికేళ్ల తరువాత అద్భుతాలు చూపిస్తానని పవన్ చెబితే.. అంతవరకూ ప్రజలు ఎదురు చూస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓటేస్తే మాకేం చేస్తావూ అని మాత్రమే చూస్తారనీ, ప్రజలు చాలా తెలివైనవాళ్లని చెప్పారు. పాతికేళ్ల పాటు అధికారం లేకుండా జనసేన మనుగడ ఎలా సాధ్యమనీ, అంతవరకూ రాజకీయాలు చేస్తూ కూర్చుంటే పార్టీ ఎలా కొనసాగుతుందో అనే అనుమానాన్ని ఆర్కే వ్యక్తం చేశారు. పవన్ తీరుపై ఇప్పుడు చాలామంది అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలంటే రాజకీయ పార్టీకి బదులుగా… ఒక ప్రత్యామ్నాయ వేదికను పవన్ నిర్మించుకోవడం ఉత్తమోత్తమమైన పని అంటూ తేల్చి పడేశారు.
అదేంటో.. జనసేన పార్టీకి సూచనలూ సలహాలూ చేయడం వారికి మాత్రమే పేటెంట్ ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఈ మధ్య వ్యవహరిస్తోంది. జగన్ తో పవన్ కు పొత్తు కుదరని వారే చెప్పేస్తారు. పవన్ సొంతంగా పోటీ చేయడం కరెక్ట్ కాదనీ వారే రాసేస్తారు. టీడీపీతో మాత్రమే పవన్ పొసుగుతుందని జాతకం చెప్పేస్తారు. ఇప్పుడేమో… రాజకీయాలకు వద్దూ, ఏదో ఒక సేవా సంస్థ పెట్టుకో అని సలహాలు ఇచ్చేస్తున్నారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనీ, అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ రాణించలేకపోయారనీ.. పవన్ ది కూడా అదే దారి అని చెప్పేస్తే ఎలా..? ఇప్పటికిప్పుడు అధికారం కోసం అర్రులు చాచకపోవడం అనేదే జనసేన మనుగడను ప్రశ్నార్థకంలో నెట్టేసేంత పేద్ద సమస్య అవుతుందా..? ఒకవేళ, నాకు అధికారం కావాలీ, ముఖ్యమంత్రిని అయిపోతా అంటూ… అన్ని స్థానాలో పవన్ పోటీ చేస్తానంటే…అబ్బేబ్బే, మరీ ఇంత ఉబాలం పనికిరాదు పవనూ, నీకు కేడర్ లేదూ విజన్ లేదూ, ప్రస్తుతానికి ఎవరితోనైనా పొత్తు పెట్టుకో పవనూ.. అని ఆర్కే గారే సలహాలు ఇవ్వకుండా ఉంటారా..?
ప్రజారాజ్యం ప్రస్థానంలో జరిగిన తప్పుల్ని పునరావృతం చేయనని పవన్ అంటున్నారు. మరో ఏడాదిన్నరపాటు ప్రజల్లో తిరిగి.. ఆ తరువాత, బలాన్ని అంచనా వేసుకున్నాక ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనేది నిర్ణయిస్తా అని చెబుతున్నారు. కాకపోతే, రాజకీయాల విషయంలో పవన్ కు ఇంకా కొంత స్పష్టత లేని మాట నిజమే. తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రులకు మరోలా వినిపించిన మాటా వాస్తవమే. వాటిని పరిగణనలోకి తీసుకుని, వాస్తవాలను పవన్ కు ఎత్తి చూపాలి. అంతేగానీ… మీరు రాజకీయాలకు పనికిరారు, దుకాణం సర్దేయండీ, ప్రత్యామ్నాయం వెతుక్కోండీ అని ఆంధ్రజ్యోతి తీర్మానించేస్తే ఎలా..? ఎన్టీఆర్ హవా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన కొన్నాళ్లలోనే టీడీపీ అధికారంలోకి వచ్చినా… ఆ తరువాత కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక స్థిరపడింది. తెరాస తీసుకున్నా అంతే కదా! ఉద్యమ వేదిక నుంచి అధికార పార్టీ వరకూ మార్పు చెందేందుకు దశాబ్దానికిపైగా సమయం పట్టింది. పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారు కదా. ఆ విజన్ ఆయనకు ఉంది. కాకపోతే, ఆచరణలో కొన్ని తడబాట్లు తప్పవు. వాటిని ఎత్తి చూపడం, సందర్భానుసారం సరిచేసుకోవాలని సూచించడం వరకూ మీడియా పరిధి ఉంటుంది. అంతేగానీ.. పార్టీని మూసేయండీ అని సూత్రీకరించే స్థాయి విశ్లేషణలు అంటే… కాస్త ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తోంది.