బిజెపి గురించి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త నిష్టూరంగా మాట్లాడగానే సంచలనం అనీ, ఆగ్రహం అనీ పెద్ద పెద్ద కథనాలు వచ్చేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి కోపానికి కారణాలు అంటూ స్పెషల్ స్టోరీ ఇచ్చింది. వాస్తవానికి ఆయన సుతిమెత్తగా సుతారంగా మాత్రమే అన్నారు. అది అలిగిన సూచనే తప్ప అల్టిమేటం కాదు. వద్దనుకుంటే నమస్కారం పెడదామని అనడంలో అదే ధ్వని.గతంలో పోలవరం విషయంలోనూ ఇలాగే అన్నా తర్వాత ఏం జరిగిందో చూశాం. ఇప్పుడైతే అంత కూడా లేదు. వద్దనుకుంటే అనడంలో అనుకోలేదని చెబుతున్నారన్నమాట. తాము బిజెపితో అంత తేలిగ్గా తెంచుకోలేమని టిడిపి నేతలు అంటూనే వున్నారు. అలాగే సర్వేలలో సందేహాలు కనిపిస్తున్నాయి గనక బిజెపి అంటే ప్రధాని మోడీ అద్యక్షుడు అమిత్షా జోడీ కూడా తెంచుకోదు. ఈ ఇద్దరినీ కలిపి వుంచే కార్పొరేట్లు స్థానికంగానూ ఢిల్లీలోనూ వున్నారు. కాకుంటే వైసీపీ వైపు మొగ్గుతున్నారనే వాతావరణం భగం చేసేందుకు చంద్రబాబు ఇలా మాట్లాడారు. మిత్రధర్మం మేరకు తమ వాళ్లకు తాను చెబుతున్నాననీ మీ వాళ్లకు మీరు చెప్పండనీ అడగడమంటే కేంద్రానిది తప్పులేదనే కదా! వాస్తవానికి జగన్ నేరుగా మోడీ కార్యాలయంతోనే సంబంధం పెట్టుకున్నారని చంద్రబాబుకూ తెలుసు. సోము వీర్రాజు వంటివారు దాన్ని ఉపయోగించుకుంటున్నారే గాని వారు కర్తలుకాదు. ఇంతకూ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ఈ ఇద ్దరి మధ్య మోడీ హాయిగా నవ్వుకుంటున్నారట.